బాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కారం...
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:33 AM
నందమూరి బాలకృష్ణ మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని పొందారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ సంస్థ ఆయన్ని లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుతో సత్కరించింది.
ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (ఐ.ఎఫ్.ఎఫ్.డి.) 2026 వేడుకలో బాలకృష్ణను ప్రతిష్ఠాత్మక లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. మార్చి 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Guptha) ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక భారత్ మండపం వేదికగా ఈ వేడుకను నిర్వహించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవలను గుర్తిస్తూ, ఐదు దశాబ్దాల విశిష్ట సినీ ప్రయాణానికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఆయన నటనలో వైవిధ్యం, కళ పట్ల అంకిత భావానికి ఇది గౌరవ సూచకంగా నిలిచింది. సీ.ఎం. రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీనటులు హేమమాలిని (Hema Malini), కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. బాలకృష్ణతో పాటు ఈ వేదికపై షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబ సభ్యులు)ను లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించారు.
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'భగవంత్ కేసరి' చిత్రం 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. అదే విధంగా, 2025లో భారత ప్రభుత్వం ఆయనకు దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ను ప్రదానం చేసి, కళారంగంలో ఆయన చేసిన సేవలను గౌరవించింది. బాలకృష్ణ అందుకున్న గౌరవాలకు ఐ.ఎఫ్.ఎఫ్.డి. లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ మరో మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది.
ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఇందులో వివిధ భాషల చిత్రాలను ప్రదర్శించడంతో పాటు మాస్టర్ క్లాసులు, ప్యానెల్ డిస్కషన్లు నిర్వహిస్తున్నారు. ఈ వేడుక రెడ్ కార్పెట్ మీద విక్కీ కౌశల్, అశ్రీన్ సోధి, అర్జున్ కపూర్, సన్యా మల్హోత్రా, వివేక్ ఒబేరాయ్ వంటి స్టార్స్ మెరిశారు. అలాగే దక్షిణాది నుంచి ప్రొసెన్ జిత్ ఛటర్జీ, అరవింద్ స్వామి వంటి వారు కూడా హాజరయ్యారు.