ఉత్తమ నటుడు నాగచైతన్య, నటి రశ్మిక మందణ్ణ...
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:59 PM
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డులను ప్రకటించింది. తెలుగులో ఉత్తమ నటుడిగా నాగచైతన్య, నటిగా రశ్మిక మందణ్ణ ఎంపికయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగి తెలంగాణ గద్దర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా 'తండేల్' (Thandel) సినిమాకు గానూ నాగచైతన్య (Naga Chaitanya), ఉత్తమ నటిగా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు గానూ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాల కోసం వారు పడిన కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. తాజాగా ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ కూడా తెలుగు సినిమా రంగం నుండి వీరిద్దరినీ ఈ సినిమాల నుండి ఉత్తమ నటుడు, నటి అవార్డులకు ఎంపిక చేసింది. అలానే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను రూపొందించిన అనిల్ రావిపూడిని ఉత్తమ దర్శకుడిగానూ, తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన 'మిరాయ్'ను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికీ ఈ సినిమాకే అవార్డు లభించింది. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రామ్ జగదీశ్ (కోర్ట్) ఎంపిక కాగా, బెస్ట్ కమెడియన్‌గా మాస్టర్ రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం)ను ఎంపిక చేశారు.
ఇదిలా ఉంటే... తమిళ రంగం నుండి ఉత్తమ చిత్రంగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఎంపికైంది. అందులో నటించిన సిమ్రాన్ ఉత్తమ నటిగా, 'కాంత'లో నటించిన దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా, దర్శకుడు మారి సెల్వరాజ్ (బైసన్) బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. కన్నడలో 'కాంతార : చాప్టర్ 1'కి ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు (రిషబ్ శెట్టి), నటి (రుక్మిణి వసంత్), దర్శకుడు (రిషబ్ శెట్టి)కి అవార్డులు లభించడం విశేషం. మలయాళంలో 'లోకా: చాప్టర్ 1' ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, ఉత్తమ నటిగా ఆ సినిమా కథానాయిక కళ్యాణీ ప్రియదర్శన్, ఉత్తమ దర్శకుడిగా డొమినిక్ అరుణ్ ఎంపికయ్యారు. 'సర్వమ్ మాయ'లో నటించిన నివిన్ పౌలీ ఉత్తమ కథానాయకుడిగా ఎంపికయ్యారు.
ఇక హిందీలో ఉత్తమ చిత్రంగా 'ఛావా', ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ (ధురంధర్), ఉత్తమ నటిగా యామీ గౌతమ్ ధర్ (హక్), ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ (ధురంధర్)లను ఎంపిక చేశారు. ప్రతి యేడాది ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ దేశంలోని పన్నెండు సినీ పరిశ్రమలను ఏకత్రాటిపైకి తీసుకొచ్చి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈసారి వేడుక ఏప్రిల్ 16న ముంబైలో జరుగబోతోంది. కరణ్ జోహార్, రానా ఈ ప్రోగ్రామ్‌కు హోస్టులుగా వ్యవహరిస్తారు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.