సినిమాలకూ రచన చేసిన ముదిగొండ శివప్రసాద్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:24 AM

చారిత్రక నవలా చక్రవర్తి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ కన్నుమూశారు. దాదాపు వంద పుస్తకాలు రాసిన ఆయన తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. ఆయన రచనల్లో కొన్ని సినిమాలు, డాక్యుమెంటరీలుగా రూపుదిద్దుకున్నాయి.

Mudigonda Sivaprasad

ప్రముఖ రచయిత, విశ్రాంత ఆచార్యులు ముదిగొండ శివప్రసాద్‌ (86) అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు విద్యానగర్ లోని ప్రైవేట్‌ హాస్పిటల్ చేర్పించగా, గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌, సెంట్రల్ ఎక్చైజ్‌ కాలనీలోని ముదిగొండ శివప్రసాద్‌ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలుకానుంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు సుష్మ, శ్రీలేఖ, ఒక కుమారుడు ఇందు శేఖర్ ఉన్నారు.

తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో సుసంపన్నం చేసిన వ్యక్తుల్లో ముదిగొండ శివప్రసాద్‌ ఒకరు. 1940 డిసెంబర్ 23న జన్మించిన ఆయన 1962లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ. పట్టా పొందారు. 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌.డీ. చేశారు. ఇండియన్‌ - గ్రీక్‌ సంస్కృతిపై తులనాత్మక అధ్యయనం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం నుంచి ఆచార్యులుగా పదవి విరమణ చేసిన శివప్రసాద్‌ యుక్తవయసులోనే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. కవితలు, కథలు, చారిత్రక నవలలు విశేషంగా రాసిన శివప్రసాద్‌ కు 'చారిత్రక నవలా చక్రవర్తి', 'శివ కవీంద్ర', 'అభినవ పాల్కురికి', 'అభినవ ధూర్జటి', 'చారిత్రక నవలా సమ్రాట్‌' వంటి బిరుదులున్నాయి. ఆయన రాసిన దాదాపు వంద పుస్తకాలలో పాతిక పైగా చారిత్రక నవలలే.


సినిమా రంగంతోనూ అనుబంధం!

ముదిగొండ శివప్రసాద్‌ రాసిన 'శ్రీలేఖ, శ్రీపదార్చన, తంజావూరు విజయం' తదితర రచనలు విద్యాలయాలలో పాఠ్య పుస్తకాలయ్యాయి. ముదిగొండ శివప్రసాద్‌ కు సినిమా రంగంతోనూ అనుబంధం ఉంది. తాళ్ళపాక అన్నమాచార్య జీవిత కథను ముదిగొండ శివప్రసాద్‌ 'శ్రీపదార్చన' పేరుతో నవలగా రాశారు. అది జాగృతి వార ప్రతికలో సీరియల్‌గా ప్రచురితమైంది. అనంతరం దానిని లక్షకాపీలు ప్రింట్‌ చేశారు. నిర్మాత శాండిల్య 'శ్రీపదార్చన'ను జంధ్యాల దర్శకత్వంలో సినిమాగా నిర్మించాలనుకున్నారు. ఆడియో క్యాసెట్‌ను సైతం విడుదల చేశారు. అయితే సినిమా పూర్తి కాలేదు. అలానే శివప్రసాద్‌ రాసిన మరో నవల స్వప్న కిరీటం, 'దశ తిరిగింది' పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది. చంద్రకళ పేరుతో ఆయన రాసిన నవల ఆధారంగా 'సమ్మక సారక్క జీవిత కథ'గా డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రానికి ముదిగొండ శివప్రసాద్‌ రచనా సహకారం అందించారు. అలానే సినిమా రంగానికి చెందిన ప్రముఖుల విశేషాలను వివరిస్తూ ముదిగొండ శివప్రసాద్‌ 'జ్ఞాపకాల పల్లకి' పేరుతో పుస్తకాన్ని వెలువరిచారు.

mu.jpg

జంటనగరాలలోని పలు సాంస్కృతిక సంస్థలతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. శివప్రసాద్‌ మృతికి పలువురు రచయితలు, సాహితీ వేత్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Updated Date - Oct 09 , 2026 | 12:26 AM