విశ్వంభర అప్డేట్ వచ్చింది.. రిలీజ్ డేట్ మిస్ అయ్యింది
ABN , Publish Date - Aug 22 , 2026 | 06:04 PM
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ లోకం, మెగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆయన నటిస్తున్న సినిమాల నిర్మాణ సంస్థలు వరుసగా బర్త్‌డే పోస్టర్లను, ప్రత్యేక గ్లింప్స్‌లను విడుదల చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా సినీ లోకం, మెగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆయన నటిస్తున్న సినిమాల నిర్మాణ సంస్థలు వరుసగా బర్త్‌డే పోస్టర్లను, ప్రత్యేక గ్లింప్స్‌లను విడుదల చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఇప్పటికే మెగా 158 టైటిల్ తేజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న రెండో చిత్రంకు కాకా అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఇది కాకుండా మెగా ఫ్యాన్స్ కి ఎప్పటి నుంచో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర (Vishwambhara) నుంచి కూడా చిత్ర బృందం ఒక సర్‌ప్రైజ్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.
దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడం వల్ల అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తపరిచారు. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందించిన ఒక పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బిట్‌ను ఈ పోస్టర్‌కు యాడ్ చేసి మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గణ గణ గణ విశ్వంభర రణధూళి అంటూ సాగిన సౌండ్ ట్రాక్ అదిరిపోయింది. గౌర హరి అందించిన లిరిక్స్ ని సాయిచరణ్ తన బేస్ వాయిస్ తో ఆలపించి గూస్ బంప్స్ తెప్పించాడు.
ఈ పోస్టర్ లో చిరు త్రిశూలన్నీ పట్టుకొని చాలా సీరియస్ లుక్ లో కనిపించారు. అయితే పోస్టర్ ఎంత గ్రాండ్‌గా ఉన్నప్పటికీ, అందులో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకపోవడం మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. చాలా కాలంగా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ పోస్టర్ పూర్తి స్థాయి ఉపశమనాన్ని ఇవ్వలేకపోయింది. సినిమా నుంచి అప్‌డేట్ వచ్చినందుకు ఆనందించాలో లేక మేకర్స్ రిలీజ్ డేట్‌ను స్పష్టం చేయనందుకు బాధపడాలో తెలియని ఒక రకమైన అయోమయ స్థితిలో అభిమానులు ఉండిపోయారు. ఏదైతే ఏమైంది.. విశ్వంభర ఆగిపోలేదు అని క్లారిటీ వచ్చిందిగా.. రిలీజ్ డేట్ త్వరలోనే ఇస్తారులే అని ఇంకొంతమంది ఫ్యాన్స్.. పోస్టర్ తో పండగ చేసుకుంటున్నారు.