మల్టీప్లెక్స్ చైన్ లింక్‌పై మహేశ్ మరింత ఆసక్తి!
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:46 PM
మహేశ్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే బెంగళూరులో ఎ.ఎం.బి. ధియేటర్స్ ప్రారంభించిన మహేశ్ త్వరలో చెన్నయ్, గోవాలోనూ మల్టిప్లెక్స్ థియేటర్స్‌ను నిర్మించ బోతున్నారు.
ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) నటన మీదే కాదు... మల్టీప్లెక్స్ బిజినెస్ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్‌తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 'ఎ.ఎం.బి. సినిమాస్' (AMB Cinema) ని స్థాపించిన మహేశ్ బాబు ఇప్పుడు వాటిని మరింతగా విస్తరిస్తున్నాడు. జనవరి 16న బెంగళూరులోని గాంధీనగర్ లో కపాలి థియేటర్ స్థానంలో మహేశ్ బాబు 'ఎ.ఎం.బి. సినిమాస్ కపాలి'ని ప్రారంభించాడు. ఇందులో ఏకంగా తొమ్మిది అత్యాధునిక స్క్రీన్స్ ఉన్నాయి. బెంగళూరు వాసులకు ఈ థియేటర్స్ సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. అలానే ప్రస్తుతం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ 70 ఎం.ఎం. ఉన్న చోట, హకీం పేట్ లోనూ ఎ.ఎం.బి. సినిమాస్ ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ అతి త్వరలోనే స్క్రీనింగ్ మొదలయ్యే ఆస్కారం ఉంది. ఇదిలా ఉంటే... త్వరలోనే చెన్నయ్ లోనూ, ఆపైన గోవాలోనూ కూడా మహేశ్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాడు.
బెంగళూరులోని ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ను అందిస్తున్న మహేశ్ బాబు ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎ.ఎం.బి.లోనూ ప్రీమియం సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్థమయ్యాడు. మార్చి 19న 'టాక్సిక్ (Toxic), ధురంధర్ 2 (Dhurandhar 2)' చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సమయానికి ఎ.ఎం.బి.లోని స్క్రీన్ 1 లో సరికొత్త బార్కో 4 కె లేజర్, హెడిఆర్ ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది డీపర్ బ్లాక్స్, బ్రైటర్ హైలైట్స్, అల్ట్రా షార్ప్ రిజల్యూషన్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. అలానే స్క్రీన్ 4లోనూ అల్ట్రా 4డిఎక్స్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ థియేటర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు తన ఎ.ఎం.బి. స్క్రీన్స్‌ను సమ్ థింగ్ స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటున్నాడు.