Madhura Sridhar Reddy: ఇక ఆపండి.. ఇండస్ట్రీ పరువు పోతుంది
ABN , Publish Date - May 27 , 2026 | 07:19 PM
ఇటీవల టాలీవుడ్‌లో తరచూ వినిపిస్తున్న ఇండస్ట్రీ సమస్యలపై దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
సినిమా పరిశ్రమలో సమస్యల గురించి పదే పదే జరుగుతున్న చర్చలపై దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sridhar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఒక అద్భుతమైన మీడియం అని, దాన్ని బాధల వేదికగా మార్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు ప్రతి వేదికపై ఇండస్ట్రీలో ఇబ్బందులు, ఒత్తిడులు, నష్టాల గురించి మాట్లాడుతుండటంపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
“ఏ వ్యాపారంలో అయినా రిస్కులు, ఒత్తిడులు, లాభనష్టాలు సహజమే. వాటిని అర్థం చేసుకుని ఆ రంగంలోకి వస్తారు. సినిమా ఇండస్ట్రీ కూడా అందుకు మినహాయింపు కాదు” అని మధుర శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకుండా వేరే వ్యాపారాలు చేసుకోవచ్చని, కానీ ప్రతిసారి మైక్ ముందుకు వచ్చి ఇండస్ట్రీ పరిస్థితులపై బాధలు చెప్పుకోవడం వల్ల పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు.
సినిమా అనేది ఒక బిజినెస్ మాత్రమే గానీ ఛారిటీ కాదని ఆయన స్పష్టం చేశారు. “ఒక సినిమా నష్టపోతే దాన్ని తట్టుకుని మరో ప్రయత్నం చేసే ధైర్యం ఉండాలి. లేదంటే ఆగిపోవాలి. వ్యక్తిగత సమస్యలను, కంపెనీ ఇబ్బందులను సినిమా మీద రుద్దకండి” అని సూచించారు. మంచి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ ఉంటుందని మధుర శ్రీధర్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. “సిన్సియర్‌గా సినిమాలు తీస్తే ప్రతి మంచి చిత్రానికి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.