సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతి అనుమానాస్పదం.. కేసు నమోదు

ABN , Publish Date - May 06 , 2026 | 10:13 AM

అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆదివారం మర ణించిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

Chandrabose brother death

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై దుండిగల్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం బౌరంపేటలోని డాలర్ విల్లాస్‌లో నివాసముండే సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్(60) ఈ నెల 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన మృతదేహమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో అక్కడి పోలీసులు బౌరంపేటలోని భార్య వసంత, కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆయన భార్య దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, జీరో ఎస్ఐఆర్ చేసి విచారణ జరిపించాలని కోరారు. వివ‌రాల్లోకి వెళితే..

హైదరాబాదులో నివసించే రాజేందర్ రెండు వారాల కిందట రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం అన్నమయ్య జిల్లా కలికిరి వచ్చి ఒక స్నేహితుడి గదిలో గడిపారు. ఆదివారం ఉదయం అస్వస్థతగా ఉండడంతో స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి నుంచి గాంధీ చౌరస్తాలోని ఒక హోటల్లో టిపిన్ తిని వెలుపలికి వచ్చి ఉన్నట్టుండి కుప్పకూలి రోడ్డుపైనే పడి ప్రాణాలొదిలారు.

విష‌యం తెలుసుకున్న పోలీసులు హైదరాబాదులోని కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించి, రాజేందర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులు తమకు కేసు అవసరం లేదని బందువులకు మృతదేహాన్ని అప్పగించాలని కోరడంతో అలాగే చేశారు. అయితే హైదరాబాదుకు చేరుకున్నాక రాజేందర్ మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించి, ఆయన భార్య వసంత సైబరాబాద్ ఫ‌రిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాజేందర్ గత నెల 18న శ్రీనివాస రెడ్డి, సుధీర్ రెడ్డిల‌తో కలిసి హైదరాబాద్ నుంచి వెళ్లినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త మృతదేహంపై గాయాలున్నాయని, విచారణ చేయించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై దుండిగల్ స్టేషన్లో జీరో ఎప్పఆర్ నమోదు చేసి కలికిరి పోలీసులకు పంపారు. దీనిపై కేసు నమోదు చేసి రాజేందర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించడానికి సీఐ అనిల్ కుమార్, మరో ఏఎ సీఐ హైదరాబాదు వెళ్లారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, శవపరీక్ష కూడా పూర్తయినట్టు కలికిరి సీఐ అనిల్ కుమార్ తెలిపారు. కుటుంబీకుల నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఆయన వివరించారు.

Updated Date - May 06 , 2026 | 10:31 AM