రాజ్యసభ వైపు రజనీకాంత్ వైఫ్ లత అడుగులు..!

ABN , Publish Date - Oct 08 , 2026 | 09:12 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ రాజ్యసభ వైపు దృష్టి సారించారు. రాష్ట్రపతి కోటాలో తనను రాజ్యసభకు పంపించాలంటూ ఆమె కేంద్ర పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Latha Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) సతీమణి లతా రజనీకాంత్ (Latha Rajinikanth) రాజ్యసభ వైపు దృష్టి సారించారు. రాష్ట్రపతి కోటాలో తనను రాజ్యసభ (Rajya Sabha)కు పంపించాలంటూ ఆమె కేంద్ర పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో రాజకీయాల్లోకి రావాలని సన్నాహాలు చేసుకున్న రజనీ.. ఆఖరి నిముషంలో మనసు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల హీరో విజయ్ సీఎం కావడం, పలువురు నటీనటులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో.. లత కూడా ఆ వైపుగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తనను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతూ ఆమె కేంద్రమంత్రులు రాజ్‌నాధ్ సింగ్, ప్రహ్లాద్ జోషి తదితరులతో మంతనాలు సాగించినట్లు తెలిసింది.


అంతేగాక త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తోనూ భేటీ కానున్నట్లు సమాచారం. నిజానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ (BJP) అగ్రనేతలతో రజనీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో మోదీ సైతం రజనీ నివాసానికి నేరుగా వెళ్లిన సందర్భాలున్నాయి. అంతేగాక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు రజనీ సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్న ప్రచారమూ ఉంది. ఈ పరిస్థితుల్లో లత చేసుకుంటున్న ప్రయత్నాలు సఫలమవుతాయని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లోక్‌సభలో 545 మంది సభ్యులుండగా, ఇందులో 543 మందిని ప్రజలు ఎన్నుకుంటారు. ఇద్దరిని మాత్రం రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అదే విధంగా రాజ్యసభలో 245 మంది సభ్యులుండగా, ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆ మిగిలిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. కళ, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష సేవలందించిన వారిని గుర్తించిన కేంద్రప్రభుత్వం.. రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేస్తుంది. వీరి పదవీకాలం ఆరేళ్లపాటు ఉంటుంది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సంగీత దర్శకదిగ్గజం ఇళయరాజా ఇలా రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయినవారే. లత ఆధ్వర్యంలో కొన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నడుస్తున్నాయి. అందువల్ల తనను రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేయాలని ఆమె రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు తెలిసింది. త్వరలోనే ఆమె అమిత్‌ షా తోనూ భేటీ కానున్నట్లు తెలిసింది.


బీజేపీ ఆలోచన కూడా అదే!

నిజానికి రాష్ట్రంపై పట్టు సాధించేందుకు బీజేపీ చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అన్నాడీఎంకేతో జత కట్టినా గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా కలసిరాలేదు. ఆదిలో తమ పట్ల సానుకూలంగా కనిపించిన టీవీకే అధినేత.. ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. భవిష్యత్తులో అన్నాడీఎంకే ఏమేరకు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అందువల్ల తమకు గట్టి మద్దతు అవసరమని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే రజనీని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించాలని కేంద్ర పెద్దలు భావించారు. అయితే అందుకు రజనీకాంత్ విముఖత చూపారో, లేక ఆ ఆలోచన ఇంకా పెండింగ్‌లోనే ఉందో తెలియదు గానీ.. ఆ ఆలోచన మాత్రం ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రజనీ సతీమణి లత రాజ్యసభకు వెళ్లేందుకు స్వయంగా ముందుకు వచ్చినందున ఆమెకు అండగా నిలిస్తే, రజనీ అభిమానులు తమ పార్టీకి మద్దతు పలుకుతారని బీజేపీ శ్రేణులు తలపోస్తున్నాయి. అది తమ పార్టీకి మేలు చేస్తుందని కాషాయ పార్టీ నేతలు యోచిస్తున్నారు. అందువల్ల లతకు త్వరలోనే శుభవార్త అందుతుందని రజనీ అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

హానెస్టీ ‘అహంకారం’గా.. ఆత్మవిశ్వాసం ‘బలుపు’గా అనిపిస్తే.. నేను తగ్గాలా?: విజయ్ దేవరకొండ

Ranabaali Trailer: పుట్టపర్తి నడిరోడ్డుపై పండబెట్టి నీ జాతిని నరుకుతా.. విజయ్ విశ్వరూపం

‘రామాయణ’ నిర్మాత ఆఫీసుల్లో ఐటీ దాడులు.. స్టాక్ మార్కెట్‌‌పై ప్రభావం

Updated Date - Oct 08 , 2026 | 09:21 PM