అల్లు అర్జున్‌కు బహిరంగ క్షమాపణలు!

ABN , Publish Date - Feb 17 , 2026 | 01:11 PM

అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కావేరీ బారువా, ఆమెను ఇంటర్వ్యూ చేసిన స్వీకృతి ఇద్దరూ బహిరంగ క్షమాపణలు తెలిపారు. తమ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అంగీకరించారు.

Kaveri Barua

గత కొన్ని రోజులుగా మీడియాలో విశేషంగా నానుతున్న పేరు కావేరీ బారువా (Kaveri Barua)! ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను ఇంటర్వ్యూ చేయాలంటే... ఆయన బృందం 42 నిబంధనలు పెట్టిందంటూ ఆమె ఇటీవల ఓ పాడ్ కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దానిని అల్లు అర్జున్ పీ.ఆర్. టీమ్ ఖండించిన వెంటనే... అల్లు అర్జున్ బృందం విధించిన నిబంధనలు ఇవేనంటూ ఓ నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై విపరీతమైన చర్చ జరిగింది. అయితే... ఇప్పుడు పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న కావేరీ బారువా, ఆమెను ఇంటర్వ్యూ చేసిన స్వీకృతి ఇద్దరూ వేర్వేరుగా తమ బహిరంగ క్షమాపణలు తెలిపి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

కావేరీ బారువా ఈ విషయమై స్వయంగా అల్లు అర్జున్‌కు క్షమాపణలు తెలిపారు. ఆమె ఈ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. 'గత కొన్ని రోజులుగా నేను ఇటీవల పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్‌లోని క్లిప్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం అవుతోంది. ఆ సంభాషణలో భాగంగా, నటుడు అల్లు అర్జున్‌తో సమావేశానికి ముందు అనుసరించాల్సినట్లు చెప్పిన 'డూస్ అండ్ డోంట్స్' గురించి నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను. అయితే పునరాలోచన చేసినప్పుడు నా పొరపాటు గ్రహించాను. ఆ వ్యాఖ్యలు సరైనవి కాదని, ఎటువంటి ధృవీకరించిన పత్రం లేకుండా వాస్తవ రహితంగా చేసినవని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే... నిబంధనల పత్రం అల్లు అర్జున్ కానీ, ఆయన తరఫున వేరెవ్వరూ గానీ నాకు ఇవ్వలేదు. ఆ వ్యాఖ్యలు సంభాషణలో సహజంగా వచ్చినవి తప్పితే, వాస్తవాలు కావు. నా ఆ వ్యాఖ్యల వల్ల ఏవైనా అపార్థాలు లేదా ప్రతిష్ఠకు హాని కలిగితే దానికి నేను హృదయపూర్వకంగా చింతిస్తున్నాను. ఆ వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను. అల్లు అర్జున్ గారి పట్ల, వారి సినీ ప్రయాణం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. నా కారణంగా వారికి కలిగిన అసౌకర్యానికి మరల క్షమాపణలు కోరుతున్నాను' అని తెలిపారు.

WhatsApp Image 2026-02-17 at 12.00.40 PM.jpeg


అలానే కావేరీ బారువాతో పాడ్ కాస్టింగ్ చేసిన స్వీకృతి (Sweekrithi) కూడా ఈ విషయమై క్షమాపణలు తెలిపారు. ఆమె ఈ విషయమై వివరణ ఇస్తూ, 'మా ప్లాట్‌ఫారమ్‌లో హోస్ట్ చేసిన ఒక లాంగ్ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్ నుండి తీసిన ఒక రీల్ ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కొందరు అసలు విషయాన్ని పక్కన దోవపట్టిస్తూ, అందులోని కొన్ని భాగాలను మాత్రమే ప్రచారం చేయడంతో అపార్థాలు ఏర్పడ్డాయి. అయితే ఆ కంటెంట్ వల్ల జరుగుతున్న అపార్థాన్ని అర్థం చేసుకుని, ఆ రీల్‌తో పాటు పూర్తి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ను కూడా వెంటనే తొలగించాం. ఈ పాడ్ కాస్ట్‌ను పరిశ్రమలో అమలులో ఉన్న విధానాలపై సాధారణ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో చేసింది మాత్రమే. అందులో పరిశ్రమలోని నిపుణురాలు తన అనుభవాలను పంచుకున్నారు. ఎవరికైనా హాని చేయడం, అపకీర్తి కలిగించడం, అనుచిత ఆరోపణలు చేయడమనేది మా ఉద్దేశం కానేకాదు. ఎవరైనా వ్యక్తి నష్టపోయే విధంగా అడ్డదారిలో లాభం పొందాలన్నదీ మా ఆలోచన కాదు. ఎలాంటి దురుద్దేశం, హానికర ఆలోచన లేకపోయినప్పటికీ మా ప్లాట్‌ఫారమ్ నుండి ప్రచురితమైన కంటెంట్ వల్ల కలిగే పరిణామాలకు ప్రచురణకర్తగా మేం బాధ్యత వహిస్తున్నాం. జరిగిన పొరపాటును అంగీకరిస్తున్నాం. అందువల్ల ఆ రీల్‌తో పాటు పూర్తి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి పూర్తిగా తొలగించాం. ఇకపై మా తరఫున ఆ కంటెంట్‌ను మళ్లీ ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరగదని హామీ ఇస్తున్నాం' అని అన్నారు. మరి ఇటు కావేరీ బారువా, అటు స్వీకృతి చెప్పిన బహిరంగ క్షమాపణలతో ఈ వివాదానికి తెర పడినట్టుగా భావించొచ్చు.

WhatsApp Image 2026-02-17 at 12.01.22 PM.jpeg

Updated Date - Feb 17 , 2026 | 01:12 PM