Oscar: ఉత్తమ చిత్రం కేటగిరిలో మరో రెండు భారతీయ సినిమాలు

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:39 AM

గవర్నమెంట్ సిఫార్స్ తో సంబంధం లేకుండా తమ నిబంధనలను అమలు చేసే సినిమాలను సైతం ఆస్కార్ అవార్డ్ కోసం కమిటీ తీసుకుంటుంది. అలా భారత్ నుండి 'కాంతార, తన్వీ ది గ్రేట్' చిత్రాలకు ఆ జాబితాలో చోటు దక్కింది. దీనికి సంబంధించిన తుది నామినేషన్ లిస్ట్ ను ఈ నెల 22న అకాడమీ ప్రకటిస్తుంది.

Kanthara: Chapter 1 - Thanvi The Great

సినీ జీవులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డులు ఆస్కార్ (Oscar)! 98వ ఆస్కార్ అవార్డులకు కౌంట్ డౌన్ మొదలైంది. భారతదేశం తరఫున ఇప్పటికే 'హోమ్ బౌండ్' (Home Bound) చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో 15 చిత్రాల షార్ట్ లిస్ట్ లో 'హోమ్ బౌండ్' చోటు దక్కించుకోవడం విశేషం. ఇదే సమయంలో మరో రెండు భారతీయ ఫీచర్ ఫిల్మ్స్ కు ఈ అవకాశం లభించింది. తాజాగా ఉత్తమ చిత్రం కేటగిరిలో ఆస్కార్ బృందం ఎంపిక చేసిన 201 అర్హత పొందిన సినిమాల జాబితాలో ఇండియా నుండి 'కాంతార చాప్టర్ 1' (Kanthara Chapter 1), 'తన్వీ ది గ్రేట్' (Thanvi The Great) చిత్రాలకు చోటు దక్కింది.


అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బెస్ట్ పిక్చర్ విభాగానికి అర్హత పొందిన సినిమాలను సాధారణ ఎంట్రీకి తీసుకుంటుంది. అలా కాకుండా కొన్ని ప్రత్యేక నిబంధనలను విధించి, వాటిని సరిగా అమలు చేసిన సినిమాలను ఈ జాబితాలో ఎంపిక చేస్తుంది. అకాడమీ రిప్రజెంటేషన్ అండ్ ఇన్ క్లూజన్ స్టాండర్డ్స్ ఎంట్రీ ఫారమ్ ను ఈ సినిమాలు సమర్పించాలి. అలానే ఎంపిక చేసిన అమెరికన్ థియేటర్లలో వీరి సినిమాలను నిబంధనలకు అనుసరించి ప్రదర్శించాలి. ఇలాంటి సినిమాలను గుర్తించి అకాడమీ అవార్డులకు నేరుగా ఎంపిక చేసుకుంటారు. ఆ రకంగా రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతారా చాప్టర్ 1', అనుపమ్ ఖేర్ నటించి, దర్శకత్వం వహించిన 'తన్వీ ది గ్రేట్'కు అర్హత లభించింది. అయితే అంతమాత్రన ఇవి అవార్డులు పొందుతాయని చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమాల్లోనూ షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ ఉంటుంది. ఇదిలా ఉంటే... వీటన్నింటినీ పరిశీలించి, జనవరి 22న నామినేషన్స్ జాబితాను అకాడమి ప్రకటిస్తుంది. మరోపక్క దర్శక నిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ 'తన్వీ ది గ్రేట్' మూవీ విడుదలై వందరోజులు పూర్తయిన సందర్భంగా దీనిని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

Updated Date - Jan 09 , 2026 | 11:39 AM