గుడ్ ఫ్రైడే: ప్రపంచ వ్యాప్తంగా శాంతిని కాంక్షిస్తున్న జనం!
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:17 PM
'లోక రక్షణార్థం. రక్తప్రోక్షణం.' అన్నది అనాదిగా వినిపిస్తున్న వేదసూక్తి- త్యాగస్ఫూర్తి. దీనిని అనుసరించే లోకుల పాపాల కోసం ఏసుక్రీస్తు తన రక్తాన్ని చిందించారు. ఆ రోజునే 'గుడ్ ఫ్రైడే'గా ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నారు. 'శుభ శుక్రవారం' ప్రత్యేకత ఏంటి?
సర్వమత సారం ఒక్కటే - మనలను సృష్టించిన దేవుణ్ణి మరలా చేరుకోవడమే మనిషి లక్ష్యం కావాలి. ఆ తీరున అన్ని మతాల పవిత్ర గ్రంథాలు మనిషికి పలు మార్గాలు చూపించాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవులకు దిశానిర్దేశం చూపిన మహానుభావుడు ఏసుక్రీస్తు. మనుషుల పాపపరిహారార్థం తన రక్తాన్ని చిందించిన కరుణామయుడు ఏసుప్రభువు. ఆయన నలభై రోజులు శోధనకు గురై తరువాత ఎన్నో మహిమలు చూపించారు. నమ్మినవారు ఏసును అనుసరించారు- నమ్మనివారు ఆయనను ఓ మంత్రగాడిగా భావించి సిలువ వేయించారు. శుభశుక్రవారాన సిలువపై తనువు చాలించిన ఏసుప్రభువు మూడవ నాడు అంటే ఆదివారం తిరిగి సమాధి నుండి లేచాడని బైబిల్ చెబుతోంది. ప్రతి యేటా ఏసుప్రభువు జనం కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ నలభై రోజుల 'లెంట్ డేస్' సాగుతాయి. చివరి శుక్రవారాన్ని 'గుడ్ ఫ్రైడే'గా భావించి, క్రైస్తవులు దైవారాధనలో సాగుతారు. ఈ కథను తెలుగువారికి అందించిన తొలి చిత్రం 'కరుణామయుడు' అనే చెప్పాలి.
క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే పర్వదినాల్లో క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ తరువాత 'గుడ్ ఫ్రైడే', 'ఈస్టర్' అంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. బైబిల్ లోని 'కొత్త నిబంధన' ఏసుక్రీస్తు జీవితాన్ని, ఆయన మహిమలను వివరిస్తుంది. చనిపోయి, తిరిగి జీవించిన ఏసుక్రీస్తు గాథ ఎందరినో పులకింప చేసింది. క్రీస్తును ప్రేమించేవారందరూ ఆయన పుట్టినరోజయిన క్రిస్మస్ ను జరుపుకుంటున్నారు. అలాగే క్రీస్తు మూడవ రోజున పునరుత్థానమయ్యాడని విశ్వసించేవారు 'ఈస్టర్' పండగను చేసుకుంటారు. 'గుడ్ ఫ్రైడే'ని పాటిస్తారు. కొందరు శుభశుక్రవారాన మనుషుల కోసం రక్తప్రోక్షణం చేసిన ఏసును స్మరించుకుంటూ ఉపవాసం చేస్తారు. మరికొందరు 'లెంట్ డేస్' మొదలైన దగ్గర నుంచీ 40 రోజులు ఉపవాసవ్రతం ఆచరిస్తారు. ఈ నలభై రోజులు ఏసుక్రీస్తును ధ్యానిస్తూ సాగుతారు భక్తులు.
ప్రపంచ శాంతి కోసం తమ ప్రాణాలనే అర్పించారు ఎందరో మహానుభావులు. అందులో క్రైస్తవ మతానికి దిక్సూచిగా నిలచిన ఏసుక్రీస్తు త్యాగాన్నీ ఎవరూ మరచిపోలేరు. అంతటి త్యాగమూర్తి అనుయాయులమని చెప్పుకొనేవారే నేడు ప్రపంచంలో యుద్ధం, అశాంతికి కారణమవుతున్నారు. వారందరి మనసులను మార్చేసి ప్రస్తుతం నెలకొన్న యుద్ధవాతావరణానికి ముగింపు పలికే రోజు రావాలని అందరూ ఆశిస్తున్నారు. రాబోయే ఈస్టర్ సందర్భంగా 'ప్రపంచ శాంతి'ని కాంక్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు సాగనున్నాయి. శాంతికాముకులైన వారి ప్రార్థనలు విని, దేవుడు ప్రపంచశాంతికి మార్గం చూపిస్తారని ఆశిద్దాం.