టీవీ షోలో సమస్య చెప్పుకుందామని వస్తే.. లైంగిక దాడి

ABN , Publish Date - Jul 09 , 2026 | 10:16 AM

భర్త వేధింపులతో టీవీ కార్యక్రమంలో తన గోడు చెప్పుకోవాలని హైదరాబాద్‌కు వచ్చిన మహిళను మాయమాటలతో తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

crime

భర్త వేదింపులతో కుంగిపోయిన ఆమె ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో తన గోడు చెప్పుకుందామని హైదరాబాద్ (Hyderabad) వచ్చింది. ఎంత వెతికినా ఆ టీవీ స్టూడియో అడ్రస్ దొరక్క అయోమయంలో ఉన్న ఆమెను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత మరో వ్యక్తి కూడా ఆమెపై దుర్మార్గానికి ఒడిగట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 48 ఏళ్ల మహిళకు 9 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కట్నం కోసం భర్త వేధిస్తుండడంతో కుమారుడితో రెండేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. ఓ టీవీ చానల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తాను పడ్డ కష్టాలు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందన్న ఆశతో మంగళవారం ధైర్యం చేసి సికింద్రాబాద్ వచ్చింది.

టీవీ స్టూడియో అడ్రస్ కోసం సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌లో వెతికి.. దొరక్కపోవడంతో మళ్లీ సికింద్రాబాద్ స్టేషన్‌కు తిరిగి చేరింది. అక్కడ ఆమెకు ఓ వ్యక్తి పరిచయమవ‌గా టీవీ షో నిర్వాహకుల దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి రాణిగంజ్‌లోని హైదరీ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడు. కాసేపటికే అక్కడి వచ్చిన మరో వ్యక్తి కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో ఇద్దరూ పారిపోయారు. బాధితురాలు మహంకాళి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jul 09 , 2026 | 10:16 AM