'పెద్ది'పై పర్సెంటేజ్ సిస్టమ్ ఎఫెక్ట్ పడనుందా!?

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:05 PM

హైదరాబాద్‌లోని 23 థియేటర్లు పర్సంటేజ్‌ సిస్టమ్ వైపు మొగ్గు చూపాయి. దాంతో రాబోయే పెద్ద సినిమాలు 'పెద్ది', 'టాక్సిక్‌' లాభాలపై ఆ ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Peddi - Toxic

సింగిల్ థియేటర్స్ మనుగడ కోసం మళ్ళీ 'పర్సంటేజ్ సిస్టమ్' రావాలని ఆశిస్తున్నారు. దీనికి కొందరు అంగీకరిస్తున్నారు... మరికొందరు విముఖంగా ఉన్నారు. 'పర్సంటేజ్ సిస్టమ్' వల్ల బిగ్ మూవీస్ కు దెబ్బ అని ఇంకొందరు అంటున్నారు.

'రెంటల్ సిస్టమ్' వచ్చిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక థియేటర్లు మూతపడ్డాయి. ఇలాంటి సినిమా హాళ్ళను ఆదుకోవాలంటే 'పర్సంటేజ్ సిస్టమ్' మళ్ళీ రావాలని ఎగ్జిబిటర్స్ చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. జంట నగరాల్లోని 23 థియేటర్స్ వారు ఇకపై తాము 'పర్సంటేజ్ విధానం'తోనే సాగుతామని ఛాంబర్ కు తేల్చి చెప్పారు. మొదటివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ 'పర్సంటేజ్ సిస్టమ్'లో అయితేనే తాము ప్రదర్శిస్తామని అన్నారు. దీనిపై తెలంగాణలో 'బిగ్ ఫోర్'గా పేరొందిన నలుగురు పంపిణీదారులతో చర్చించారు. వీరికి కూడా తెలంగాణలో థియేటర్స్ ఉండడం గమనార్హం. ఈ పర్సంటేజ్ విధానంపై 'ఏసియన్ ఫిలిమ్స్' సునీల్ నారంగ్, 'ఎస్వీసీ' శిరీష్ రెడ్డి, 'గీతా' డిస్ట్రిబ్యూషన్స్ బాబీ, 'మైత్రీ' శశిధర్ రెడ్డితో ఎగ్జిబిటర్స్ చర్చలు సాగించారు. వీరిలో శశిధర్ రెడ్డి మాత్రం తన నిర్మాతలు, భాగస్వాములతో చర్చించిన తరువాత ఏ విషయమూ చెబుతానని అన్నారు. మిగిలిన వారు అంగీకరించారు. ఏప్రిల్ 3వ తేదీ నుండే ఈ విధానం అమలులోకి వచ్చింది. ఇది రాబోయే భారీ చిత్రాలు 'పెద్ది', 'టాక్సిక్'పై ప్రభావం చూపిస్తాయని కొందరు అంటున్నారు.


'రెంటల్ సిస్టమ్'లో ఏరియాను, థియేటర్ పొజిషన్ ను దృష్టిలో పెట్టుకొని రోజుకు ఇంత 'అద్దె' అని నిర్ణయిస్తారు. తద్వారా థియేటర్ ఓనర్ కు రెంట్, ప్రేక్షకుల సంఖ్యను బట్టి మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే లభిస్తాయి. సదరు థియేటర్ లో ఎంత వసూళ్ళు వచ్చినా, అది నేరుగా డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలకు మాత్రమే చెందుతుంది. బిగ్ మూవీస్ లేకపోతే చిన్న సినిమాల ద్వారా లభించే మెయింటెనెన్స్ ఛార్జీలు థియేటర్స్ వారికి ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. అందువల్లే 'పర్సంటేజ్ సిస్టమ్' కోసం సింగిల్ థియేటర్స్ వారు చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. మార్చి 11వ తేదీన బెంగళూరులో దక్షిణాదికి చెందిన పలువురు ఎగ్జిబిటర్స్ సమావేశమయ్యారు. ఇకపై సౌత్ అంతటా 'పర్సంటేజ్ సిస్టమ్'ను అమలు చేయాలనీ తీర్మానించారు. అసలు ఈ మధ్యకాలంలో 'పర్సంటేజ్' విధానానికి తెరతీసింది - ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి అని చెప్పవచ్చు. తరువాత ఇది మెల్లగా అంతటా పాకుతూ వస్తోంది... ఇప్పుడు నగరంలోని 23 థియేటర్స్ ఆ బాటలోనే సాగుతున్నాయి.


'పర్సంటేజ్ సిస్టమ్'కు దిల్‌ రాజు, శిరీష్‌ రెడ్డికి చెందిన 'ఎస్వీసీ' డిస్ట్రిబ్యూషన్స్ మొదటి నుంచీ మద్దతుగా నిలచింది. తాము రిలీజ్ చేయబోయే 'టాక్సిక్'ను కూడా అదే పంథాలో ప్రదర్శిస్తామని అంటున్నారు. థియేటర్స్ ను కాపాడుకోవడమే తమ లక్ష్యమని వారు చెబుతున్నారు. అయితే 'మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్' మాత్రం తమ 'పెద్ది' చిత్రాన్ని 'పర్సంటేజ్ సిస్టమ్'లో రిలీజ్ చేస్తే హైదరాబాద్ నగరంలోనే భారీ నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. తెలుగు సినిమాలకు ప్రస్తుతం కంచుకోట లాంటిది హైదరాబాద్ నగరం... అందులో 23 థియేటర్స్ 'పర్సంటేజ్'తోనే సాగుతామంటే 'భారీ చిత్రాలకు' పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. అయితే గుడ్ టాక్ వస్తే పెద్ద సినిమాల వసూళ్ళ తీరే వేరుగా ఉంటుంది. కాబట్టి నిర్మాతలకు, పంపిణీదారులకు నష్టం ఉండదని ఎగ్జిబిటర్స్ మాట. రాబోయే 'పెద్ది', 'టాక్సిక్' చిత్రాల సమయానికి 'పర్సంటేజ్'తోనే సాగుతారా? లేక ఈ 23 థియేటర్స్ 'రెంటల్ సిస్టమ్'కు 'నో' అంటూ షెట్టర్స్ దించుతాయా? - ఆ రెండు సినిమాలు వచ్చే నాటికి ఏదో ఒక విధంగా సమస్యను కొలిక్కి తెచ్చుకోవాలి. ఏమవుతుందో చూడాలి.

Updated Date - Apr 03 , 2026 | 05:06 PM