DIFF 2026: కొండల్లో.. వెండితెర పండగ
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:35 PM
చలనచిత్రోత్సవాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. గోవా, కోల్‌కతా, కేరళ, ముంబయి చలనచిత్రోత్సవాల గురించి తెలుసు. అయితే వీటన్నింటికీ భిన్నంగా హిమాలయాల్లో నిర్వహించే ఒక ఫిల్మ్ ఫెస్టివల్ గత 15 ఏళ్లుగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
చలనచిత్రోత్సవాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. గోవా, కోల్‌కతా, కేరళ, ముంబయి చలనచిత్రోత్సవాల గురించి తెలుసు. అయితే వీటన్నింటికీ భిన్నంగా హిమాలయాల్లో నిర్వహించే ఒక ఫిల్మ్ ఫెస్టివల్ గత 15 ఏళ్లుగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అదే 'ధర్మశాల అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (డీఐఎఫ్ఎఫ్). ఈనెల 29 నుంచి నవంబర్ 1 వరకు సాగే ఈ ఉత్సవం విశేషాలివి.
ఒకవైపు హిమాలయాల సౌందర్యం.. మరోవైపు బౌద్ధారామాలు. హిమాలయ శ్రేణుల్లో.. ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆవాసంగా చెప్పుకునే ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్)లో గత కొన్నేళ్లుగా వెండితెర మెరుపులు మెరుస్తున్నాయి. అదే ప్రాంతానికి చెందిన ఫిల్మ్ మేకర్స్ రీతూ సరీన్, టెంజింగ్ సోనమ్‌లు 2012లో సమకాలీన సినిమాకు వేదిక కల్పించాలనే సంకల్పంతో 'ధర్మశాల అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (Dharamshala International Film Festival 2026) శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఇండిపెండెంట్ సినిమా, ప్యారలల్ సినిమాలు, డాక్యుమెంటరీలు తీసే తీసే యువ దర్శకులను ప్రోత్సహించడం మొదలెట్టారు. వారి విభిన్నమైన ఆలోచనా విధానంతో.. డీఐఎఫ్ఎఫ్ (DIFF 2026) ప్రారంభించిన రెండు మూడేళ్లలోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈసారి జరుగుతున్నది 15వ ఎడిషన్.
ప్రముఖుల సందడి..
దేశవ్యాప్తంగా జరుగుతున్న రెగ్యులర్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు దీనికి తేడా ఉంది. ప్రారంభంలో తమ ప్రాంత (కొండ ప్రాంతాల సినిమా) సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు లిమిటెడ్‌గా జరిపినప్పటికీ.. అక్కడ నిర్వహించే కార్యక్రమాలు విభిన్నంగా ఉండటంతో.. అవి సినిమా వాళ్లతో పాటు, సినీ ప్రియులను కూడా ఆకర్షించాయి. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ చలన చిత్రోత్సవాలకు హాజరవ్వడం మొదలెట్టారు. నసీరుద్దీన్ షా. మనోజ్ బాజ్‌పేయి, ఆదిల్ హుస్సేన్, కొంకణాసేన్ వంటి నటీనటులతో పాటు అనురాగ్ కశ్యప్, పా.రంజిత్, దిబాకర్ బెనర్జీ, చైతన్య తమ్హానే, ఆసిఫ్ కపాడియా, గీతూ మోహన్ దాస్ వంటి దర్శకులు వారిలో ఉన్నారు. అదేవిధంగా ఉత్సవాల్లో ప్రదర్శించే చిత్రాలు కూడా విభిన్నమైనవి కావడంతో సహజంగానే దేశవ్యాప్తంగా సినీప్రియులు డీఐఎఫ్ఎఫ్కు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు.
2026 సినిమాలివే..
ఇదిలాఉంటే.. ఈ ధఫా 15వ ధర్మశాల అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే చిత్రాలు ఎప్పటిలాగే ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో ఈ ఏడాదే రూపుదిద్దుకున్న రెహ్మత్ (Rehmat) ఒకటి. ప్రస్తుత పంజాబ్‌లో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న మూడు కథలివి. ఒక మహిళ గాయపడిన అపరిచితుడికి రహస్యంగా తన ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఆ తర్వాత ఏం జరిగింది? ఒక కుటుంబంలో తండ్రి కనిపించకుండా పోతే పిల్లల తాత ఎలా నెట్టుకొచ్చాడు? ఒక వృద్ధుడు తనను తాను దేవుడిగా చెప్పుకుంటూ గ్రామానికి వస్తే తర్వాతేం జరిగిందనేది ఈ చిత్ర కథాంశం. దర్శకుడు గుర్విందర్ సింగ్ (Gurvinder Singh) తీసిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రను నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) చేయడం విశేషం.
థాయ్‌లాండ్ నుంచి చిత్రోత్సవంలో పాల్గొంటున్న 'టెంపుల్స్ టు హెవెన్'లో వృద్ధురాలైన తల్లి మరణించవచ్చనే జోస్యం విన్న తర్వాత ఆమె కొడుకు సకోల్ పరిహారంగా తొమ్మిది దేవాలయాలను సందర్శించే ఒక రోజు తీర్థయాత్రకు సిద్ధమవుతాడు. ఆ తర్వాతేం జరిగిందనేది ఆసక్తికరం.సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ఏర్పడిన రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఫోకస్ చేస్తూ.. నలభై ఐదేళ్ల రైతు జురికో భార్యను కోల్పోతాడు. తన పంటను ఇటాలియన్ కొనుగోలుదారులు అతి తక్కువకు అడిగితే తిరస్కరిస్తాడు. అనేక కష్టాల మధ్య జురికో జీవితం ఎలా సాగిందనేది 'గురియా' ఇతివృత్తం.
ఇక ఇరాన్‌కు చెందిన 'ఏ ఫాక్స్ అండర్ ఏ పింక్ మూన్' కథాంశానికొస్తే.. 16 ఏళ్ల వయసులోనే ఆఫ్ఘన్ శిల్పి, చిత్రకారిణి సొరయా ఎంత అందంగా ఉంటాయో, అంతే విషాదంగా కనిపించే శిల్పాలను సృష్టిస్తుంది. ఆమె భర్తతో వేగలేక ఇరాన్ విడిచిపెట్టి, ఆస్ట్రియాలో ఉండే తల్లిని కలిసేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆమె సుదీర్ఘ ప్రయాణాన్ని దర్శకుడు మెహర్దాద్ ఓస్కోయిచే తెరకెక్కించాడు. వీటితో పాటు సిరాట్ (స్పెయిన్), టైం అండ్ వాటర్ (ఐస్లాండ్), ది ఆర్డినరీ స్టార్ (ఇండియా), సెల్టిక్ ఉటోపియా (ఐర్లండ్), టెర్మైట్ (ఇండియా), టూ సీజన్స్ టూ స్ట్రేంజర్స్ (జపాన్), అమ్మ ఆరియన్ (ఇండియా), మయిలా (ఇండియా), మిడ్నైట్ మొమో (అమెరికా) వంటి సినిమాలను ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి నాలుగు రోజుల పాటు సాగే డీఐఎఫ్ఎఫ్.. సరికొత్త సమకాలీన సినిమా ప్రపంచానికి తెర తీస్తూ మంచుకొండల్లో విజయపతాక ఎగరేస్తోంది. - చల్లా