సుడిగాలి సుధీర్ సినిమా.. స్టేజీపై వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:08 PM
సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన G.O.A.T సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. మంచు మనోజ్, నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు.
బుల్లితెరపై తనదైన కామెడీతో ప్రేక్షకులకు చేరువైన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఇప్పుడు వెండితెరపై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం G.O.A.T (గోట్) Greatest Of All Times అనేది ఉపశీర్షిక. దివ్యభారతి (Divya Bharathi) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ (Vedavyas) దర్శకుడు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
ఈ వేడుకకు హీరో మంచు మనోజ్, నిర్మాత నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 'సుడిగాలి సుధీర్‌కు నేను అభిమానిని. ఆయన బుల్లితెర నుంచి ఎలా ఎదిగాడో అందరికి తెలుసు. సుడిగాలి సుధీర్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గోట్ పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను' అని అన్నారు.
హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఈ రోజు సినిమా విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ సినిమానే కాదు. నేడు గ్రామాల్లో జరుగుతున్న బెట్టింగ్.. గ్యాంబ్లింగ్ల గురించి చెప్పే సినిమా. ఈ సినిమాలో సొసైటికి మంచి మేసేజ్ ఉంది. ఈ సినిమాను ఈ రోజు ఇలా విడుదల అవుతుంది అంటే నిర్మాత చంద్రశేఖరే కారణం. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను పూర్తిచేశాడు. ఈ సినిమాతో నాకు పర్సనల్‌గా ఎంతో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఉంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని అంటూ, ఈ క్రమంలో నిర్మాతల గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
దర్శకుడు వేదవ్యాస్ మాట్లాడుతూ 'ఆన్లైన్ బెట్టింగ్ వల్ల భారతదేశంలో ఎన్నో లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంత వరకూ దాదాపు 20 కోట్ల మంది నష్టపోయారు. ఈ ఊరిలో ఎవరూ బెట్టింగ్ ఆడకూడదు అనే దగ్గర జరిగే కథ ఇది. ఆ గ్రామం కోసం జరిగే ఫైట్ ఏమిటి అనేది ఈ కథ. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని.. బ్లాక్‌బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను' అని అన్నారు.
నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 'ఈ మూవీని ఎంతో విల్పవర్తో ఓ కామన్మ్యాన్లా పూర్తిచేశాను. ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా, ఓ మంచి క్వాలిటి సినిమా చేశానని గర్వంగా చెప్పగలను. చిరంజీవి గారికి ఖైదీలా సుడిగాలి సుధీర్‌కు గోట్ ఉంటుంది. దివ్యభారతి పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం ఎంతో సహకరించింది. ఆమెకు హీరోయిన్గా ఇది మంచి డెబ్యూ. ఈ సినిమాను మణిశర్మ సంగీతం మరో లెవల్‌కు తీసుకెళ్లింది. కమర్షియల్ ఫార్మాట్లో చెప్పిన సందేశాత్మక చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు మా కష్టానికి తగిన ప్రతిఫలం విజయం రూపంలో ఇస్తారని నమ్ముతున్నాను' అని అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ 'ఈ రోజు గోట్ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే అంతా ఆషామాషి కాదు. ఈ సినిమా సుధీర్‌తో పాటు అందరికి మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను' అన్నారు. హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ 'చాలా ఒడిదుడుకులు, అడ్డంకులు దాటుకుని సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడి పనిచేశాం. ఈ ఫంక్షన్‌కు మనోజ్ గారు రావడం ఎంతో ఆనందంగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈసినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా చూడండి. నచ్చితే పది మందికి చెప్పండి. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లో చూసి, ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను' అని అన్నారు.