సీజీఐ కంటెంట్‌ దిశగా గ్రీన్‌ గోల్డ్ యానిమేషన్‌

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:10 PM

పిల్లల యానిమేషన్ సీరియల్స్, సినిమాల రూపకల్పనలో పేరెన్నికగన్న గ్రీన్‌ గోల్డ్ సంస్థ అద్భుతమైన వి.ఎఫ్.ఎక్స్. సర్వీసులను సినిమాలకు అందిస్తోంది. వారు వర్క్ చేసిన తాజా చిత్రం 'రాకాస' మంచి విజయాన్ని అందుకోవడం పట్ల సంస్థ అధినేత రాజీవ్‌ చిలక హర్షం వ్యక్తం చేశారు.

Rajeev Chilaka

భారతదేశపు ఐకానిక్ ‘చోటా భీమ్’ సృష్టికర్త గ్రీన్ గోల్డ్ యానిమేషన్, దేశంలోని అగ్రగామి యానిమేషన్ స్టూడియోలలో ఒకటి. ఇప్పుడు తన విఎఫ్‌ఎక్స్‌ డివిజన్ ద్వారా పిల్లల కంటెంట్‌కు మించి విస్తరిస్తూ, ఇటీవల విడుదలై విజయం సాధించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘రాకాస’ చిత్రానికి తన సేవలు అందించింది.

ఈ ప్రాజెక్ట్‌తో గ్రీన్‌ గోల్డ్‌ స్టూడియో మెయిన్‌స్ట్రీమ్ థియేట్రికల్ సినిమాల్లో కాంప్లెక్స్, క్యారెక్టర్-డ్రివెన్ పనుల్లోకి గణనీయమైన అడుగు వేసినట్టు అయ్యింది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారికా కొణిదెల జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. ‘రాకాస’ చిత్రంలో పూర్తి కంప్యూటర్ జనరేటెడ్ (సీజీ) పాత్ర ఉంది. తెలుగు సినిమాల్లో ఈ స్థాయిలో ఇలాంటిది అరుదు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ పాత్ర మాట్లాడదు. పూర్తిగా యానిమేషన్, కదలికలు, విజువల్ ఎక్స్‌ప్రెషన్ ద్వారా భావోద్వేగాలను తెలియజేస్తుంది. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ విఎఫ్ఎక్స్‌ డివిజన్ ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచి ఫైనల్ డెలివరీ వరకు దర్శకురాలు, నిర్మాణ బృందం వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌తో సన్నిహితంగా కలిసి పని చేసి, ఈ పాత్రను తెరపైకి సజావుగా తీసుకొచ్చారు.


'రాకాస' మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజీవ్ చిలక మాట్లాడుతూ, 'రాకాస’ మాకు చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్. ఇందులో పాత్ర సృష్టిని వేరే రీతిలో అప్రోచ్ చేయాల్సి వచ్చింది. ప్రతి భావోద్వేగం కూడా పెర్ఫార్మెన్స్, డీటెయిలింగ్ ద్వారా వ్యక్తం కావాల్సిన పూర్తి డిజిటల్ పాత్రను రూపొందించడం సవాలుగా మారింది. నిజ జీవిత టైమ్‌లైన్స్, అనుకున్న బడ్జెట్‌లో ఇంత పెద్ద స్థాయి పనిని డెలివర్ చేయగలగడం మరింత అర్థవంతంగా ఉంది. ఇది మా టీమ్‌ బలాన్ని, ఫిల్మ్‌మేకర్లతో మా అనుబంధాన్ని తెలియచేసింది' అని అన్నారు. ఈ సినిమా కోసం 750కి పైగా సీజీ షాట్స్‌ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి డెలివర్ చేశామని, కొత్త టెక్నాలజీలపై ఆధారపడకుండా, బలమైన ప్లానింగ్, సమర్థవంతమైన వర్క్‌ఫ్లో, సహకారంపై దృష్టి పెట్టామని, ఇందు కోసం 100 మందికి పైగా ఆర్టిస్టుల బృందం పని చేసిందని రాజీవ్‌ చిలక చెప్పారు.


దీని గురించి మురళీ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, 'సూక్ష్మమైన ముఖ కవళికల నుంచి బాడీ లాంగ్వేజ్, సిమ్యులేషన్ వరకు ప్రతి వివరం కూడా ఉద్దేశపూర్వకంగా, నమ్మకంగా ఉండాల్సి వచ్చింది. సరైన ప్లానింగ్, బలమైన టీమ్ కారణంగా మాకిది సాధ్యమైంది. మా టూల్స్, ప్రాసెస్‌ను ఉపయోగించి ఈ సినిమా విఎఫ్ఎక్స్‌ వర్క్ చేశాం' అని అన్నారు.

నిహారిక కొణిదెల ఈ విషయమై మాట్లాడుతూ, ' 'రాకాస' మూవీ ప్రారంభం నుండి గ్రీన్‌ గోల్డ్ వీఎఫ్ఎక్స్‌ టీమ్ మా విజన్‌ను అర్థం చేసుకుని టైమ్‌ బౌండ్‌లో ప్రాడక్ట్‌ను కంప్లీట్‌ చేసింది. కథ సారాంశాన్ని కోల్పోకుండా డెలివర్ చేయడం వారి ప్రత్యేకత' అని ప్రశంసించారు. 'రాకాస'కు లభించిన విజయం నేపథ్యంలో ఈ తరహాలో మరిన్ని చిత్రాలకు క్వాలిటీ వీఎఫ్ఎక్స్ ను గ్రీన్ గోల్డ్ అందించే ప్రయత్నంలో ఉంది.

Updated Date - Apr 08 , 2026 | 04:54 PM