ఇక‌పై మల్టీప్లెక్స్ త‌ర‌హ‌లోనే.. సింగిల్‌ స్క్రీన్లలో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:29 AM

మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ తరహాలో ఇకపై పర్సంటేజ్‌ విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని హైదరాబాద్‌లోని 23 సింగిల్‌ స్క్రీన్ థియేటర్ల యజమానులు నిర్ణయించారు.

theaters

మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ తరహాలో ఇకపై పర్సంటేజ్‌ విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని హైదరాబాద్‌లోని 23 సింగిల్‌ స్క్రీన్ థియేటర్ల యజమానులు నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్ (Telugu Film Chamber) ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా ప్రదర్శితమయ్యే తొలి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం రెవెన్యూ షేర్‌ ఉంటుందని తెలిపింది.

23 మంది ఎగ్జిబిటర్స్‌ ఇటీవల తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ను సంప్రదించారు. తమ థియేటర్లు నగరంలోని ముఖ్య ప్రదేశాల్లో ఉన్న ప్రీమియర్‌ థియేటర్లు అని, అయితే అద్దె విధానంలో వాటిని నిర్వహించడం కష్టమవుతోందని, అందుకే తెలంగాణలోని శిరీష్‌ రెడ్డి, సునీల్‌ నారంగ్‌, బాబీ, శశిధర్‌ రెడ్డి వంటి డిస్ట్రిబూటర్లతో చర్చలు జరిపి తమ ప్రతిపాదన చెప్పగానే పర్సంటేజ్‌ విధానానికి అంగీకరించారని ఆ ఎగ్జిబిటర్స్‌ చెప్పారు.

శశిధర్‌ రెడ్డి మాత్రం నిర్మాతలు, ఇతర భాగస్వాములతో చర్చించిన తర్వాత తన అభిప్రాయం చెబుతానన్నారని కూడా ఎగ్జిబిటర్స్‌ చెప్పారు. ఇకపై తెలంగాణలోని ఇత‌ర‌ సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో కూడా విడతలవారీగా ఈ పర్సంటేజ్‌ విధానం అమలు చేయనున్నట్లు ఎగ్జిబిటర్స్ (exhibitors) తెలిపారని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Apr 03 , 2026 | 07:30 AM