టాలీవుడ్‌లో పొంచి ఉన్న ప్రమాదం!
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:42 PM
సినీ కార్మికులు మళ్ళీ సమ్మె బాట పట్టే ఛాయలు గోచరిస్తున్నాయి. అదే జరిగితే సమ్మర్ కు విడుదల కావాల్సిన సినిమాల పరిస్థితి అగమ్యగోచరమే అవుతుంది.
సంక్రాంతి సీజన్ సక్సెస్ ఫుల్‌గా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగానూ ఈ వారం దాదాపు పది చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అంతేకాదు... సమ్మర్ సీజన్‌లో కన్నడ అనువాద చిత్రం 'టాక్సిక్' (Toxic), హిందీ డబ్బింగ్ మూవీ 'ధురంధర్ -2' (Dhurandhar 2), అడివి శేష్ 'డెకాయిట్', పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', శర్వానంద్ 'బైకర్', నిఖిల్ పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ', రామ్ చరణ్ 'పెద్ది' (Peddi), అఖిల్ 'లెనిన్' తదితరల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇవన్నీ షూటింగ్ చివరి దశలోనూ, లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిపై సమ్మె పోటు పడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
గత యేడాది సినిమా కార్మికులు వేతనాలు పెంచాలంటూ సమ్మె చేశారు. దాంతో కొన్ని వారాల పాటు సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇటు ఫిల్మ్ ఛాంబర్, అటు ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో లేబర్ కమీషనర్‌ను రంగంలోకి దించి, స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దీనిపై దృష్టి సారించడంతో కార్మికులు శాంతించి షూటింగ్స్ కు హాజరయ్యారు. ఆ సమయంలో కొలిక్కిరాని సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం ఓ కమిటీని వేశారు. కానీ అదికూడా సరైన దిశగా కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా స్టూడియో వర్కర్స్ యూనియన్, ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్స్ యూనియన్లు తమ అసంతృప్తులను వ్యక్తం చేస్తూ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు లేఖలు రాశాయని తెలుస్తోంది. తమ నిరసన వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లితే దానికి తాము బాధ్యులం కాదంటూ ఈ లేఖలో వారు పేర్కొన్నట్టు సమాచారం. ఈ రెండు యూనియన్లే కాకుండా మరికొన్ని యూనియన్ల నేతలు సైతం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 1వ తేదీ నుంచి తిరిగి సమ్మెకు దిగుతామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే... సమ్మర్‌కు విడుదల కావాల్సిన పెద్ద సినిమాలపై ప్రభావం పడుతుంది. గతంలో మాదిరిగానే ఇది చినికి చినికి గాలివానగా మారి దీర్ఘకారిక సమ్మెకు దారితీస్తే మాత్రం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తెలుగు సినిమా రంగం మళ్ళీ కుదేలు కావడం ఖాయం. మరి గత యేడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు సత్వరమే చర్యలు తీసుకుంటారేమో చూడాలి.