Female Directors: ఈ యేడాది ఫిమేల్ డైరెక్టర్స్ పయనం
ABN , Publish Date - Aug 30 , 2026 | 08:42 AM
'ఆకాశంలో సగం మేమే' అంటూ అన్ని రంగాల్లోనూ మహిళలు సాగుతున్నారు. సినిమారంగం మినహాయింపేమీ కాదంటూ ఫిమేల్ డైరెక్టర్స్ (Female Directors) చాటుతున్నారు.
'ఆకాశంలో సగం మేమే' అంటూ అన్ని రంగాల్లోనూ మహిళలు సాగుతున్నారు. సినిమారంగం మినహాయింపేమీ కాదంటూ ఫిమేల్ డైరెక్టర్స్ (Female Directors) చాటుతున్నారు. కొందరు అదరహో అనిపిస్తే - మరికొందరు బెదరగొట్టారు... మరి ఈ యేడాది మహిళా దర్శకుల తీరు ఏంటో చూద్దాం...
బంపర్ హిట్ 'బంగారం'... (Maa inti Bangaram)
మహిళా దర్శకులు తెరకెక్కించే చిత్రాలకు భారీ బడ్జెట్ కేటాయించడానికి ఏ నిర్మాత ముందుకు రారు. కానీ, నిర్మాత వెంకట్ కె.నారాయణ, కన్నడ స్టార్ హీరో యశ్ ఇద్దరూ కలసి 500 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి 'టాక్సిక్' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్టర్.అలా హ్యూజ్ బడ్జెట్ మూవీ తీసిన లేడీ డైరెక్టర గా గీతూమోహన్ దాస్ నిలచిపోయారు. కానీ, ఆమె తెరకెక్కించిన 'టాక్సిక్' (Toxic) డిజాస్టర్ గా మారింది. దాంతో ఫిమేల్ డైరెక్టర్స్ కు అంత బడ్జెట్ కేటాయించరాదంటూ సినీజనం అంటున్నారు. అయితే ఈ యేడాది తగిన బడ్జెట్ తో నందినీ రెడ్డి 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ పెట్టుబడి కన్నా మిన్నగా లాభాలు చూసింది. వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సమంత నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం'తో నందినీ రెడ్డి కెరీర్ లోనే బిగ్ హిట్ సాధించారు.
'దాయ్రా'పై ఆసక్తి...
గీతూ మోహన్ దాస్ కు భారీ బడ్జెట్ ఇచ్చినా డిజాస్టర్ తీసింది. తగిన వ్యయంతో నందినీ రెడ్డి నిర్మాతకు లాభాలు చూపించింది. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు రూపొందించిన చిత్రాల గురించి సినీజనం చర్చించుకుంటున్నారు... ఈ నేపథ్యంలోనే మరో దర్శకురాలు మేఘనా గుల్జార్ ను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో "తల్వార్, రాజీ, ఛపక్, శామ్ బహదూర్" వంటి చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు మేఘనా గుల్జార్. అందువల్ల ఆమె దర్శకత్వంలో రూపొందిన 'దాయ్రా' సినిమాపై సినీ ఫ్యాన్స్ ఆసక్తిని పెంచుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కాబోతోంది. మేఘనా గత చిత్రం 'శామ్ బహదూర్' బాక్సాఫీస్ సక్సెస్ చూడడమే కాదు, జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలు పెంచే చిత్రంగా జాతీయ అవార్డునూ సొంతం చేసుకుంది. దాంతో రాబోయే 'దాయ్రా'పై సినీ ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు మేఘనా 'దాయ్రా' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.
'పరాశక్తి' పరాజయం...
ఈ యేడాది లేడీ డైరెక్టర్ రూపొందించగా విడుదలైన తొలి చిత్రం 'పరాశక్తి'... శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన 'పరాశక్తి' సినిమా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కింది. జనవరి 10వ తేదీన విడుదలైన 'పరాశక్తి' పరాజయం పాలయింది. రవి మోహన్, అథర్వ, శ్రీలీల నటించిన 'పరాశక్తి' విడుదలకు ముందు ఆసక్తి కలిగించింది. ఎందుకంటే గతంలో సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన 'ఆకాశం నీ హద్దు' విమర్శకుల ప్రశంసలు పొంది అలరించింది. అయితే 'పరాశక్తి' మాత్రం మురిపించలేకపోయింది.
ఆకట్టుకున్న 'సిస్టమ్'
ఈ యేడాది మే నెలలో ఇద్దరు మహిళా దర్శకుల చిత్రాలు వెలుగు చూశాయి. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో రూపొందిన 'సిస్టమ్' చిత్రం మే 22న విడుదలయింది. వారం రోజులకే అంటే మే 29వ తేదీన త్రిబేణి రాయ్ రూపొందించిన 'షేప్ ఆఫ్ మోమో' వెలుగు చూసింది. 'షేప్ ఆఫ్ మోమో' సినిమా థియేటర్స్ లో విడుదల కాగా, 'సిస్టమ్' సినిమా అమేజాన్ ప్రైమ్ లో నేరుగా రిలీజయింది. సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు పోషించిన 'సిస్టమ్' జనాన్ని ఆకట్టుకుంది.
ఇతరులకు స్ఫూర్తి...
ఈ సంవత్సరం ఇప్పటి దాకా ఐదుమంది మహిళా దర్శకులు తమ చిత్రాలతో జనం ముందుకు వచ్చారు. వారిలో ఒకరు డిజాస్టర్ ఇస్తే, మరొకరు అపజయాన్ని చవిచూశారు. ఒకే ఒక్కరు ఘనవిజయం సాధించారు. మిగిలిన ఇద్దరు ప్రశంసలు పొందారే తప్ప ఆర్థిక లాభాలు చూడలేకపోయారు. అంటే ఈ యేడాది మహిళా దర్శకుల సక్సెస్ రేట్ 20 పర్సెంట్ మాత్రమే ఉంది. ఆ పర్సేంటేజ్ కన్నా నిర్మాతలు చూసిన నష్టం బేరీజు వేస్తే మరింత బేజారు కలుగుతుంది. ఏమైనా తెలుగు దర్శకురాలు నందినీ రెడ్డి సాధించిన విజయం ఇతర లేడీ డైరెక్టర్స్ కు స్ఫూర్తి నిస్తోందని చెప్పవచ్చు.
రాబడి తెస్తుందా...!?
ఇక ఇప్పుడు మహిళా ప్రేక్షకుల్లో సినీ ఫ్యాన్స్ ఆశలన్నీ మేఘనా గుల్జార్ తెరకెక్కించిన 'దాయ్రా' మీదే ఉన్నాయి. అలాగని ఈ సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లో లేదు. మేఘనా తన అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారని చెప్పొచ్చు. ఇందులో సగటు జీవి ఎదుర్కొనే ఓ పరిస్థితికి తగిన పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది ప్రధానాంశం. క్రైమ్ థ్రిల్లర్ గా 'దాయ్రా' రూపొందింది. సెప్టెంబర్ 18న జనం ముందు నిలవనున్న 'దాయ్రా' తగిన బడ్జెట్ తో తెరకెక్కింది. మరి మేఘనా రూపొందించిన 'దాయ్రా' పెట్టుబడికి తగిన రాబడి తెస్తుందేమో చూడాలి.