తమిళ నిర్మాతలూ అదే బాటలో...
ABN , Publish Date - Apr 23 , 2026 | 02:44 PM
థియేటర్స్ మూతపడరాదు అంటే 'ఎయిట్ వీక్స్' రూల్ అప్లై చేయాలని ఈ మధ్యే ఎగ్జిబిటర్స్ నిర్ణయించారు. ఈ అంశాన్ని అత్యధిక సంఖ్యలో తెలుగు నిర్మాతలు వ్యతిరేకించారు. ఇప్పుడు తమిళ నిర్మాతలు సైతం 'ఎయిట్ వీక్స్ రూల్'కు నో చెబుతున్నారు!
టాప్ స్టార్స్ అందరూ ఏడాదికి ఒకటో, రెండేళ్ళకు ఒక సినిమాలోనో నటిస్తున్నారు. దీంతో థియేటర్స్‌కు సరైన ఫీడ్ లభించడం లేదు. అందువల్ల టాప్ స్టార్స్ మూవీస్‌ను రిపీట్ రన్స్‌లో ప్రదర్శిస్తున్నారు. అది కూడా లాభసాటిగా లేదని ఎగ్జిబిటర్స్ భావించారు. ఓ హిట్టయిన సినిమా కనీసం రెండు నెలలు థియేటర్స్‌లోనే సాగినా తమకు సరైన ఫీడ్ లభించినట్టే అంటున్నారు సినిమా హాళ్ళ యజమానులు. ఈ నేపథ్యంలో ఆ మధ్య బెంగళూరులో పలువురు థియేటర్స్ యజమానులు, పంపిణీదారులు సమావేశమయ్యారు. ఏ సినిమా అయినా 8 వారాల వరకు ఓటీటీలో ప్రదర్శించరాదని అప్పుడు థియేటర్స్ కు కూడా జనాలు వస్తారని వారు నిర్ణయించారు. ఈ 'ఎయిట్ వీక్స్ రూల్' వల్ల ఓటీటీ రైట్స్ డిమాండ్ తగ్గుతుందని, అప్పుడు నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. దాంతో 'ఎయిట్ వీక్స్ రూల్'ను తెలుగు నిర్మాతల్లో అత్యధికులు వ్యతిరేకించారు. ఇప్పుడు తమిళనాడులోనూ నిర్మాతలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
ప్రస్తుతం టాప్ స్టార్స్ నటిస్తోన్న సినిమాల ఓటీటీ రైట్స్ భారీ రేటు పలుకుతున్నాయి. ఓ టాప్ హీరో ప్రాజెక్ట్ అండర్ ప్రొడక్షన్‌లో ఉండగానే నిర్మాతలకు ఓటీటీ రైట్స్ రూపేణా హ్యూజ్ అమౌంట్స్ అడ్వాన్స్‌గా అందుతున్నాయి. ఒకవేళ '8 వీక్స్ రూల్'కు అంగీకరిస్తే సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటలో ప్రదర్శిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతి ప్రకారం నెల, అంతకు లోపులోనే ఓటీటీలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలో ప్రదర్శిస్తే సినిమా హాళ్ళు వెలవెల బోతాయని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. అదే జరిగితే థియేటర్స్ ను మూయడం తప్ప వేరే మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ మధ్య బెంగళూరులో కేవలం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే సమావేశమయ్యారు. వారు థియేటర్స్ మనుగడ కోసం 'ఎయిట్ వీక్స్ రూల్'ను తీసుకు వచ్చారు. ఈ విధానం ఉత్తరాదిన అమలులో ఉందనీ అంటున్నారు. అయితే దక్షిణాది అతి పెద్ద సినిమా రంగాలయిన తెలుగు, తమిళ చిత్రసీమలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వీరి నిర్ణయాన్ని మళయాళ సినిమా నిర్మాతలు సైతం సబబే అంటున్నారు. ఏ సినిమారంగానికైనా ఛాంబర్ సుప్రీమ్ అథారిటీ అని, ఛాంబర్‌లో నిర్ణయం తీసుకోకుండా ఎక్కడో కొంతమంది చేరి రూల్స్ క్రియేట్ చేయడం సరి కాదని నిర్మాతలు అంటున్నారు. అందువల్ల 'ఎయిట్ వీక్స్' రూల్‌ను తాము అంగీకరించబోమని యాక్టీవ్ తెలుగు నిర్మాతలు ఎప్పుడో తేల్చి చెప్పారు. ఇప్పుడు వారి బాటలోనే తమిళ ప్రొడ్యూసర్స్ కూడా సాగుతున్నారు. 8 వారాల ఏకపక్ష నిర్ణయాన్ని ఇటీవలే ఏర్పడిన 'సౌత్ ఇండియన్ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' అంగీకరించ లేదు. అంతేకాదు తమ సభ్యులకు '8 వీక్ రూల్'పై సంతకాలు చేయవద్దనీ సూచించింది. దీంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. దీనిపై ఏప్రిల్ 26న జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో తేలుస్తామని తమిళ నిర్మాతలు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి!