యూట్యూబర్ నందూస్ వరల్డ్.. విచారణ! నాటకీయ పరిణామాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:10 AM
ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ రమానందన విచారణలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు, స్పాన్సర్షిప్స్ ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ (NandusWorld) రమానందన విచారణలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రమానందనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివ క్రాంతి కుమార్ స్టేషన్ పరిసరాల్లో మంగళవారం కనిపించలేదు. కానీ అద్దంకి నుంచి వచ్చిన రమానందన చేతిలో మోసపోయిన మరో బాధితుడు శ్రీనివాసరావు స్టేషన్ బయట తనను రమానందన మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వస్తున్న ఆమెను మీపై వస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని మీడియా ప్రశ్నించగా, మొత్తం మీరే చేశారని మీడియా మీద తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె లాయర్లు వారిస్తున్నా వినకుండా చిందులు తొక్కారు.
వీసా రెన్యువల్స్, లండన్‌లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో హైదరాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం నోటీసులు అందుకున్న ప్రముఖ యూట్యూబర్ 'నందూస్ వరల్డ్' రమానందన (YouTuber Nandana) మంగళవారం జిల్లాలోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు హాజరయ్యింది. తన వెంట వచ్చిన నలుగురు. లాయర్ల సమక్షంలో ఆమెను సీఐ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు నాలుగు గంటల పాటు విచారణ చేశారు. మొత్తం 30 నుంచి 40 ప్రశ్నల వరకు పోలీసులు అడిగినట్టు తెలిసింది. ఆమె కొన్నింటికి మాత్రమే సమాధానాలు చెప్పినట్టు సమాచారం.
విచారణ అనంతరం సీఐ మాట్లాడుతూ తాను ఎవ్వర్ని మోసం చేయలేదని, ఏ తప్పు చేయలేదని, ఎవ్వరి వద్ద డబ్బులు వసూలు చేయలేదని, మొత్తం తన భర్త మధుకర్ డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలు చూస్తారని చెప్పారన్నారు. సమయానికి వెళ్లకపోవడం వల్లే వీసాలకు తమను సంప్రదించిన వారి వీసాలు రద్దయ్యాయి తప్ప మా తప్పేం లేదని, వీసాలు ఎందుకు రద్దయ్యాయో వచ్చిన ఎస్ఎమ్ఎస్లను చూపించినట్లు ఆయన తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె వివరించిందన్నారు. మరికొన్ని ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేదన్నారు.
ఆమెను. ఆమె భర్త మధుకర్ ను, మామ మోహన్రావును ఈ నెల 16న మరో మారు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు. తాను లండన్ వెళితే తప్ప తన భర్త మధుకర్ ఇండియాకు వచ్చే అవకాశాలు లేవని, తమ పిల్లలను స్కూల్ కు పంపాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు లండన్‌లో ఉండాలని, ఇద్దరం ఒకే సారి విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని ఆమె చెప్పినట్లు సీఐ తెలిపారు.
లుక్ అవుట్ నోటీసులు ఎత్తివేస్తే విచారణకు సహకరిస్తానంటూ మెయిల్
తొలుత తమపై ఉన్న లుక్ అవుట్ నోటీసులు ఎత్తివేస్తే విచారణకు సహకరిస్తామని రమానందన ముందస్తుగా పోలీస్ ఉన్నతాధికారులు, ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యంకు మెయిల్ పెట్టారు. అయితే లుక్ అవుట్ నోటీసులు ఎత్తి వేసేందుకు పోలీసులు అంగీకరించలేదు. అయినా సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమై, నోటీసులు అందుకొని మంగళవారం విచారణకు హాజరయ్యారు.
రూ.20 లక్షలు కట్టాం: బాధితుడు శ్రీనివాసరావు
రమానందన ఇబ్రహీంపట్నం పీఎస్ కు విచారణకు వస్తున్న విషయం తెలుసుకుని అద్దంకికి చెందిన ఆమె బాధితుడు శ్రీనివాసరావు వచ్చారు. ఇక్కడి మీడియాలో మాట్లాడుతూ రమానందన వీడియోలు చూసి మా పిల్లలు యూకే వెళ్లేందుకు సంప్రదింపులు చేశారన్నారు. రమానందన, మధుకర్ చెబితే విడతల వారిగా రూ.20 లక్షల వరకు వారి అకౌంట్‌లో వేశామని చెప్పారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్లు ఎత్తడం మానేశారని ఆరోపించారు. లండన్ వెళ్లిన తర్వాత మా పిల్లలు అనేక ఇబ్బందులు పడ్డారని వాపోయారు. తప్పు చేయకుంటే ఆమె మాట్లాడొచ్చు కదా అని ప్రశ్నించారు. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అని బాధితుడు శ్రీనివాసరావు వేడుకున్నారు.