దర్శకుడు శ్రీను వైట్లకు బురిడీ.. రూ. 7.2 కోట్ల నష్టం

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:56 PM

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల మోసపోయారు. నకిలీ పత్రాలను నిజమని నమ్మి ఆయన వికారాబాద్‌లో కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు చేజారిపోయింది. దాంతో ఆయన సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.

Srinu Vaitla

జాతీయ, అంతర్జాతీయ నేరస్థులను పట్టుకోవడానికి హీరోతో తెలివైన పనులు చేయించే దర్శకులు నిజజీవితంలో చిన్న విషయాల్లోనే మోసపోతుంటారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla) విషయంలోనూ అదే జరిగింది. దాదాపు ఏడేళ్ళ క్రితం ఆయన తన మేనకోడలు పాశం శ్వేతతో కలసి వికారాబాద్‌ జిల్లాలో కొన్న భూమి వివాదంలో చిక్కుకుంది. తమది కాని భూమికి దొంగ పత్రాలను తయారు చేసిన కొందరు వ్యక్తులు దానిని ఏడు కోట్ల రూపాయలకు శ్రీను వైట్లకు అమ్మినట్టు తెలిసింది. ఆ పత్రాలు నకిలీవని గుర్తించని శ్రీను వైట్ల చెక్కుల రూపంలో డబ్బు చెల్లించి, రిజిస్టర్డ్ సేల్‌ డీడ్‌ ను తీసుకున్నారు.


ఆ తర్వాత కొంత కాలానికి వికారాబాద్‌ కలెక్టరేట్ నుండి భూమి యాజమాన్యం విషయమై విచారణ నోటీసు రావడంతో ఈ మోసం బయటపడింది. విచారణలో శ్రీను వైట్లకు అమ్మిన వారికి ఈ భూమిపై ఎలాంటి హక్కు లేదని, వారు రికార్డులను మార్పిడి చేశారని తేలింది. అలానే మరి కొందరు ఈ భూమిపై హక్కుకై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, రికార్డులను ధృవీకరించి ధరణి ఎంట్రీలను సరిదిద్దాల్సిందిగా ఆదేశించింది. విచారణ అనంతరం ఆ భూమి వేరే క్లయింట్లకు కేటాయించారు.

దాంతో శ్రీను వైట్ల, ఆయన మేనకోడలు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించి, నిందితులపై ఫిర్యాదు చేశారు. ఎకరానికి అరవై లక్షల రూపాయలు మార్కెట్ విలువ ఉన్నట్టుగా అంచనా వేసిన సీసీఎస్‌ పోలీసులు... శ్రీను వైట్లకు రూ. 7.2 కోట్ల నష్టం జరిగినట్టు తేల్చి, 12 మందిపై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Mar 26 , 2026 | 05:07 PM