అవయవ దానానికి సిద్ధమైన శైలేష్ కొలను!
ABN , Publish Date - Feb 20 , 2026 | 06:11 PM
ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను మరణానంతరం తన అవయవాలను దానం చేయడానికి అంగీకారం తెలిపారు. దానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని ఆయన స్వీకరించారు.
'హిట్' (Hit) ఫ్రాంచైజ్ ద్వారా దర్శకుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు శైలేష్ కొలను (Sailesh Kolanu). వెండితెరపై తన హీరోలను రఫ్ అండ్ టఫ్ పర్సన్స్‌గా చూపించే శైలేష్ కొలను మనసు మాత్రం నవనీతం అనేది ఇటీవల రూఢీ అయ్యింది. ఈ మధ్య అవయవ దానానికి సంబంధించిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మరణానంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో నిర్వాహకులు ఆయనకు 'దాత అనుమతి కార్డు'ను అందించారు. ఇలా తన అవయవాలను దానం చేయడానికి అంగీకారం తెలపడం ద్వారా ఎంతోమందికి శైలేష్ కొలను స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా శైలేష్ కొలను మాట్లాడుతూ, 'మనందరం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. మనం మరణించిన తర్వాత కూడా ఇతరులకు సహాయం చేయడం అనేది గొప్ప విషయం. అవయవాలను దానం చేయడం ద్వారా కొందరి జీవితాల్లో మనం వెలుగు నింపినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇటీవల ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసి కొందరికి సాయం చేశారు. మనిషి చనిపోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులను అవయవ దానం చేయమని కన్విన్స్ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా ఈ జీవితానికి మించి జీవించవచ్చని వారికి అర్థమయ్యేలా చెబితే వారు కన్వెన్స్ అవుతారు' అని శైలేష్ కొలను చెప్పారు. తనను ఆ రకంగా మోటివేట్ చేసిన మోహన్ ఫౌండేషన్‌కు శైలేష్ కొలను ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ శైలేష్ కొలనుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.