దిల్ రాజు ఆవిష్కరించిన ‘లవ్ వైరస్ 2’ పోస్టర్
ABN , Publish Date - Jun 09 , 2026 | 08:00 AM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘లవ్ వైరస్ 2’ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కృతమైంది. దర్శకుడు సయ్యద్ నుమాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బృందాన్ని దిల్ రాజు అభినందిస్తూ కొత్తవారికి తమ సంస్థ ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
స్వయంకృషి క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు సయ్యద్ నుమాన్ తెరకెక్కిస్తున్న షార్ట్ ఫిల్మ్ ‘లవ్ వైరస్ 2’ (Love Virus 2). అరమాస ప్రవీణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) అవిష్కరించారు.
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తన కార్యాలయంలో ‘లవ్ వైరస్’ తొలి భాగాన్ని వీక్షించిన దిల్ రాజు, చిత్ర బృందాన్ని అభినందించారు. మొదటి భాగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో రెండో భాగం నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం తమ సంస్థ ఎప్పటి నుంచో కొనసాగిస్తున్న సంప్రదాయమని చెప్పారు. దర్శకుడు సయ్యద్ నుమాన్ మంచి కథతో ముందుకు వస్తే, భవిష్యత్తులో తమ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
పరిమిత బడ్జెట్‌తో, తక్కువ సమయంలో నాణ్యమైన షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించినందుకు దర్శకుడు, నిర్మాతతో పాటు మొత్తం యూనిట్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నటీనటులు భాను ప్రకాష్, గణపతి, హసీనా, శ్రీహర్ష, శ్యామ్, శివ నాగులు, మహేష్ పాల్గొన్నారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ యామిని, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పిట్ల హరీష్ సహా చిత్ర బృంద సభ్యులు హాజరయ్యారు.