Dhanush: 2025లో డైరెక్టర్ గా రెండు... హీరోగా మూడు...

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:55 AM

ధనుష్‌ హీరోగా నటించిన మూడు చిత్రాలు, దర్శకత్వం వహించిన రెండు సినిమాలు 2025లో విడుదలయ్యాయి. వీటికి లభించిన ఆదరణ పట్ల ధనుష్‌ హర్షం వ్యక్తం చేశాడు. ధనుష్ 2025లో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో హీరోగా నటించాడు.

Dhanush Movies

ప్రముఖ తమిళ నటుడు ధనుష్‌ (Dhanush) 2025లో తన కెరీర్ రివ్యూ చేసుకున్నాడు. వివిధ భాషల్లో మూడు సినిమాలు చేయడమే కాకుండా... వాటి ద్వారా వచ్చిన గుర్తింపు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. గతంలో ధనుష్‌ 'పా పాండి, రాయన్' చిత్రాలను డైరెక్ట్ చేశాడు. అందులో 'రాయన్' (Rayan) మూవీలో తనే కీ-రోల్ ప్లే చేశాడు. ఈ యేడాది ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదటిది 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్'. ఈ సినిమాతో ధనుష్‌ మేనల్లుడు పవీష్ నారాయణ్ హీరోగా పరిచయం అయ్యాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళంలో విడుదలై పరాజయం పాలైంది. ఇదే సినిమాను తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' పేరుతో డబ్ చేశారు. ఇక్కడా ఇది ఆడలేదు.


ధనుష్ నటించిన బైలింగ్వల్ మూవీ 'కుబేర' (Kubera) జూన్ 20న వచ్చింది. 'సార్' తర్వాత ధనుష్ తెలుగులో నటించిన స్ట్రయిట్ మూవీ ఇది. నటుడిగా ధనుష్ కు మంచి పేరే వచ్చింది కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekhar Kammula) ఈ కథను సరిగా హ్యాండిల్ చేయలేదనే విమర్శలు వచ్చాయి. నాగార్జున లాంటి స్టార్ హీరోనూ సరిగా ఉపయోగించుకోలేదనే మాట వినిపించింది. ఇక ధనుష్ హీరోగా నటించిన మరో తమిళ చిత్రం 'ఇడ్లీ కడై'. ఇది అక్టోబర్ 1న విడుదలైంది. దీనికి కూడా ధనుషే దర్శకుడు. నిత్యామీనన్ హీరోయిన్. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఆడలేదు. తెలుగులో దీన్ని 'ఇడ్లీ కొట్టు' (Idli Kottu) పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన మర్నాడే 'కాంతార: చాప్టర్ 1' రావడంతో దాని ప్రభావం ఈ సినిమా కలెక్షన్స్ మీద బాగా పడిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇక ధనుష్‌ హీరోగా నటించిన మరో హిందీ సినిమా 'తేరే ఇష్క్ మే'. ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో ధనుష్‌ సరసన కృతీ సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిందీలో బాగానే ఆడింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో డబ్ అయినా ఎక్కడా దాని ప్రభావాన్ని చూపించలేదు. చిత్రం ఏమంటే... 2025 మూడు భాషల్లో తాను నటించిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయని, అందుకు కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతున్నానని నూతన సంవత్సరం సందర్భంగా ధనుష్ తెలిపాడు. నిజం చెప్పాలంటే కమర్షియల్ సక్సెస్ అనేది 2025లో ధనుష్‌ కు ఎండమావి. అతనితో సినిమాలు నిర్మించిన వారికి ఏమైనా ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు కానీ సినిమాలను విడుదల చేసిన పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ మాత్రం బాగానే నష్టపోయారు. హిందీ సినిమా 'తేరే ఇష్క్ మే' మాత్రం దీనికి మినహాయింపు.

Updated Date - Jan 01 , 2026 | 09:03 AM