Kishore boyidapu: ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ టు 'మేము COPలం’
ABN , Publish Date - May 26 , 2026 | 03:23 PM
కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు.. (Kishore Boyidapu) తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నారు.
కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు (Kishore Boyidapu) తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన సిరీస్ 'మేము COPలం’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కించటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్‌కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.
నా పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్. మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో సహజంగానే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. మా నాన్న మమ్మల్ని ఫోటో తీసి.. ఆ ఫోటోలతో కథ చెప్పేవారు. అక్కడే నాకు ఈ ఫీల్డ్‌లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అలా నాకు కెమెరా మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. 2002లో రవి ప్రసాద్ యూనిట్‌లో కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. ఓ నాలుగేళ్ల తర్వాత ముంబైకి వెళ్లాను. అక్కడ మొదటి ప్రాజెక్ట్‌గా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేశాను. ఆ తరువాత ఇంగ్లీష్ సినిమాలకి కూడా వర్క్ చేశాను. ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా పని చేసిన అనుభవం ఉంది. 2012లో ‘బాయ్ మీట్స్ గర్ల్’ అనే సినిమాకి డీఓపీగా పని చేశా. అలా చేస్తున్న టైంలో 2015 లో అనిల్ మెహతాతో జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ జర్నీ ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా నుంచి ప్రారంభమై, ‘జెర్సీ’ సినిమా వరకు కొనసాగింది. ఈ ప్రయాణంలో మధ్యలో మరో పది సినిమాల్లో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి వన్ ఆఫ్ ది మెయిన్ అసిస్టెంట్‌గా పని చేయడం నా కెరీర్‌లో ఎంతో ఆనందాన్ని, మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతి విషయం నా సినిమాటోగ్రఫీ జర్నీలో ఎంతో ఉపయోగపడింది. ఆయనకు ఎప్పటికి రుణపడి ఉంటా. కోవిడ్ తర్వాత నాకు 'మై నేమ్ శృతి','105 మినిట్స్' వంటి సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు, నేను మెహతాతో మాట్లాడాను. అప్పుడాయన..'వెళ్లి నీ సొంతంగా వర్క్ స్టార్ట్ చేయి' అంటూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అలా మళ్లీ నేను కెమెరామెన్‌గా నా ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించాను.
సవాలుతో కూడుకున్నది..
సింగిల్ షాట్‌లో సినిమా తీయడం అనేది సవాల్‌తో కూడుకున్న పని. హన్సిక గారితో చేసిన ‘105’ సింగిల్ కారెక్టర్‌తో, సింగిల్ షాట్‌తోనే మూవీని చేశాం. ఇందులో ఉన్న శ్రమ ఆడియెన్స్‌కి అవసరం లేదు. ప్రేక్షకులకు సినిమా నచ్చిందా? లేదా? అన్నదే ముఖ్యం. కానీ సింగిల్ షాట్‌లో సినిమా తీయడం అనే దానికి వెనుకున్న కష్టం గురించి ఎవ్వరికీ తెలీదు. ఏ ఒక్క చోట మిస్టేక్ జరిగినా.. మళ్లీ మొత్తం మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. సినిమాటోగ్రఫీలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రవి వర్మన్ గారు, అనీల్ మెహతా గారు, సుదీప్ చటర్జీ గారిని నేను ఎక్కువగా ఫాలో అవుతుంటాను.
అలా చేస్తే ఇక్కడ నచ్చదు..
హాలీవుడ్ సినిమాల్లో కలర్ టోన్ ఎక్కువగా నేచురల్, సాఫ్ట్, సినిమాటిక్‌గా ఉంటుంది. వాళ్లు రియలిస్టిక్ లైటింగ్, కంట్రోల్డ్ కలరింగ్ ఉపయోగిస్తారు. ఇండియన్ సినిమాల్లో మాత్రం వైబ్రంట్ కలర్స్, రిచ్ స్కిన్ టోన్స్, ఎమోషనల్ లైటింగ్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే మన కల్చర్ ఫెస్టివల్స్, కాస్ట్యూమ్స్, వాతావరణం, ఎమోషన్స్ ఇలా అన్నింటినీ బేస్ చేసుకుని చూస్తే మన స్టోరీ టెల్లింగ్‌తో అవన్నీ కనెక్టింగ్‌గా ఉంటాయి. అందుకనే మన సినిమాల్లో కలర్స్‌కు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు ఏస్, రా, హెచ్‌డిఆర్ వంటి అడ్వాన్స్ కలర్ వర్క్ ఫ్లోలను ఉపయోగిస్తాయి. ఇప్పుడు మన సినిమా కూడా అదే పంథాలో ముందుకు వెళుతుంది. హాలీవుడ్‌లో వాడే కలర్ టోన్ వేరు. మన కథలు వేరు, మన కల్చర్ వేరు, మన చుట్టు పక్కల ఉండే వారి కలర్స్ వేరు.. మనకు ఆ టోన్‌లో తీస్తే.. ఇక్కడి వరకు అంతగా నచ్చకపోవచ్చు.
బాధ్యతతో కూడిన పని అది..
'మేము COPలం’ మొత్తం షూటింగ్‌ను కేవలం 17 రోజుల్లో పూర్తి చేశాం. మంచి ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ వల్ల... ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అందరూ తమ బెస్ట్ ఇచ్చి సజావుగా పూర్తయ్యేలా సపోర్ట్ చేశారు. ప్రస్తుతం నేను చేసిన ‘ప్రేమకు నమస్కారం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. షణ్ముక్, శివాజీగారు, భూమికగారు ఇందులో నటించారు. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో ‘మన డాక్టర్ బాబు’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. కెమెరామెన్ టు డైరెక్టర్ అనేది అంత సులభమైన పని కాదు. డైరెక్షన్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాక్కూడా కొన్ని ఆలోచనలున్నాయి. కానీ ఇప్పట్లో మాత్రం అటు సైడ్ వెళ్లను. ప్రస్తుతం నేను ఏఐ టెక్నాలజీని నేర్చుకునే పనిలో ఉన్నాను.