చెన్నై-లండన్ కలయిక.. ఇండియాలో 30కి పైగా బిగ్ స్క్రీన్స్.. సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి!

ABN , Publish Date - Aug 19 , 2026 | 09:16 PM

చెన్నైకి చెందిన క్యూబ్ సినిమా, లండన్‌కు చెందిన డాల్బీ సంస్థలు చేతులు కలిపాయి. దేశవ్యాప్తంగా మూడు సంవత్సరాల్లో 30కి పైగా ప్రీమియమ్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నాయి.

Dolby Cinema, Cube Cinema

ఇటు ఇండియాలోని చెన్నై- అటు ఇంగ్లండ్ లోని లండన్ కలసిపోతున్నాయి. వింటూంటేనే విచిత్రంగా ఉంది కదూ. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన డిజిటల్ జెయింట్స్ కలసి ఓ ప్రయోగం చేయబోతున్నాయన్న మాట. ఆ ఎక్స్ పరిమెంట్ ఏంటో మరి!?

ప్రపంచ వ్యాప్తంగా డాల్బీ సినిమా (Dolby Cinema), 'క్యూబ్ సినిమాస‌ (Cube Cinema) అన్నవి సినీ ఫ్యాన్స్ కు సుపరిచితమైన మూవీ టెక్నాలజీ కంపెనీస్. డిజిటల్ నాన్-లీనియర్ ఎడిటింగ్, డిజిటల్ సినిమాకు మన దేశంలో 'క్యూబ్ సినిమా' పెట్టింది పేరుగా నిలచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మూవీ సౌండ్ లో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూ సాగుతోంది 'డాల్బీ సినిమా'. ఇప్పుడు ఈ రెండు సంస్థలు చెట్టాపట్టాలేసుకొని మన దేశంలో సాగాలని నిశ్చయించాయి. ఈ అంశం సినీ ఫ్యాన్స్ కు మహదానందం కలిగిస్తోంది. తెరపై విజువల్ బ్యూటీ చూపించడంలో మేటిగా 'క్యూబ్' నిలిస్తే, సౌండ్ సిస్టమ్స్ తో మురిపిస్తూ సాగుతోంది 'డాల్బీ'. అలాంటి ఈ రెండు సినిమా టెక్నాలజీకి చెందిన జెయింట్స్ కలిస్తే ఆనందం కలగక ఏమవుతుంది?. ఈ సంస్థల కలయికలో ఓ 30కి పైగా ప్రీమియమ్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్ రూపొందనున్నాయట.

ప్రేక్షకుల కోసమే...

'డాల్బీ సంస్థ'ను రే డాల్బీ 1965లో లండన్ (London)లో మొదలు పెట్టారు. తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30 కేంద్రాలలో తన సామ్రాజ్యాన్ని విస్తరించింది 'డాల్బీ సంస్థ'. క్యాసెట్స్ తో ఆరంభమైన 'డాల్బీ' సౌండ్స్ పయనం ప్రస్తుతం అధునాతన 'డాల్బీ అట్మాస్'తో సాగుతోంది. ఇక 'క్యూబ్ సినిమా' విషయానికి వస్తే 1986లో ఈ సంస్థను చెన్నై (Chennai)లో సెంథిల్ కుమార్, జయేంద్ర ఆరంభించారు. ఇండియాలో వేలాది స్క్రీన్స్ లో 'క్యూబ్ టెక్నాలజీ' ఆధారంగా సినిమా ప్రదర్శనలు సాగుతున్నాయి. ఇప్పుడు లండన్ లోని 'డాల్బీ', చెన్నైలోని 'క్యూబ్' కలసి మన దేశంలో 30కి పైగా ప్రీమియర్ లార్జ్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేయబోతున్నాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ సినిమాను మరింత పెద్ద స్క్రీన్ పై చూడాలని ప్రేక్షకులు తపిస్తున్నారు. వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకొనే 'డాల్బీ', 'క్యూబ్' సంయుక్తంగా బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నాయి.

Dolby Cinema, Cube Cinema

ఏ తరహా అనుభూతి...

ప్రస్తుతం భారతీయ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. అలాగే మన దేశంలోని ప్రేక్షకులు సైతం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మన సినిమాలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందించడానికి ఇండియన్ మూవీ మేకర్స్ తపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ ప్రేక్షకులను రంజింప చేయడానికి అన్నట్టుగా సినీపరిశ్రమలో జెయింట్స్ గా పేరొందిన క్యూబ్, డాల్బీ సంస్థలు చేతులు కలిపాయి. ప్రేక్షకులను రంజింప చేయడమే ధ్యేయంగా ఈ రెండు సంస్థలు పలు ప్రయోగాలు చేస్తూ సాగాయి. ఇప్పుడు కలసి దేశవ్యాప్తంగా 'ఎపిక్' ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. రాబోయే మూడు సంవత్సరాలలో ఈ సంస్థల ఆధ్వర్యంలో 30కి పైగా బిగ్ స్క్రీన్స్ రానున్నాయి. ఈ భారీ తెరలపై సినిమాలు చూసిన జనం ఏ తరహా అనుభూతి చెందుతారో మరి!?

Updated Date - Aug 19 , 2026 | 09:58 PM