Baraabar Premistha: ఈవెంట్‌లో.. బూతు పాట‌! సారీకి చంద్రహాస్ నో.. వెళ్లి త‌ప్పు చేశాన‌న్న జేడీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:50 PM

'బరాబర్ ప్రేమిస్తా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బూత పదాలతో పాట పాడిన చంద్రహాస్ ను నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేడీ చక్రవర్తి చంద్రహాస్ చర్యను నిరసించాడు. అయితే తాను మాత్రం ఎవరికీ సారీ చెప్పనని చంద్రహాస్ అంటున్నాడు.

Chandrahaas - JD Chakravarthi

ఫిబ్రవరి 6వ తేదీ ఈటీవీ ప్రభాకర్ (ETv Prabhakar) తనయుడు చంద్రహాస్ (Chandrahaas) హీరోగా నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' (Baraabar Premistha) సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ ఈ సినిమాలోని ఓ పాటను పాడాడు. అందులో కొన్ని అసభ్యకరమైన పదాలు ఉండటంతో ఆ కార్యక్రమానికి హాజరైన అతిథులు అవాక్కయ్యారు. మరికొందరు అతని తెగింపు చూసి ఆశ్చర్యపోయారు. కొందరు సిగ్గుతో తలదించుకుంటే... మరికొందరు కేరింతలు కొడుతూ విజిల్స్ వేశారు. ఆ వేదిక మీద ఈ పాట పాడి అందరి దృష్టిలో పడాలని అనుకున్న చంద్రహాస్ కోరిక అయితే నెరవేరింది. ఆ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్స్ చంద్రహాస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలాంటి బూతు పదాలను అంత నిర్లజ్జగా ఎలా పబ్లిక్ ఫంక్షన్స్ లో పాటగా పాడతాని తిట్టిపోశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వెంటనే వాకౌట్ చేయకుండా ఎలా ఉండిపోయారని మరికొందరు ప్రశ్నించారు. మరికొందరైతే చంద్రహాస్ పై కార్టూన్లూ గీశారు.

'బరాబర్ ప్రేమిస్తా' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జరిగి ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో అందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడి చక్రవర్తి ఆ తర్వాత తన స్పందన తెలియచేశాడు. అక్కడ జరిగిన దానికి బాధపడుతున్నానని చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇటీవల నేను అతిధిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో... ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాను. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నాను. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, భాషలతో కాదని నేను బలంగా నమ్ముతాను' అని జె.డి.చక్రవర్తి (JD Chakravarthi) అన్నారు.


'చెప్పను బ్రదర్' అంటున్న చంద్రహాస్

ఇదిలా ఉంటే తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తినా, పట్టించుకునేదే లేదంటున్నాడు హీరో చంద్రహాస్. అతను కూడా తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో మాట్లాడుతూ, 'నేను స్టేజ్ మీద పాడిన పాట ఎంతో వైరల్ అయ్యింది. ఆ పాట నచ్చి వైబ్ అవుతున్న వారూ ఉన్నారు. ఆ పాట నచ్చని వారికి నేను సారీ చెప్పను... మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయి ఉండొచ్చు. నావి ఎప్పుడో హర్ట్ అయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా వందల, వేల బూతు పదాలను నాపై ప్రయోగించారు. అప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? నన్ను విమర్శించిన వారు ఉపయోగించిన వాటిలో రెండు పదాలను మాత్రమే తీసుకుని నేను పాటగా పాడాను. ఎవరికీ అమ్మానాన్న నేర్పించరు. మీ నుండే నేను వాటిని నేర్చుకున్నాను. నిజానికి నా మీద వచ్చిన విమర్శలను నేను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ కొందరు నా ఫ్యామిలీని టార్గెట్ చేసి దూషించారు. వాళ్ళను మాత్రం వదిలిపెట్టను' అని చెప్పాడు.


తన ప్రవర్తనను గురించి కొందరు చేస్తున్న వ్యాఖ్యలపైనా చంద్రహాస్ స్పందిస్తూ, 'నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. నేనెవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు, యాటిట్యూడ్ చూపించలేదు. ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదు. మా సినిమాలోని పాట నిడివి మూడున్నర నిమిషాలు. ఈ పాటకు పనిచేసిన వాళ్ళు చిన్నా చితక వాళ్ళు కాదు. నిజానికి ఒరిజినల్ వర్షన్ ఆ పదాలు లేవు. సినిమా రిలీజ్ ముందు ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం నేను ఎవరికీ చెప్పకుండా ఆ పదాలను వేదిక మీద ఉపయోగించాను. అంతకు మించి ఇంకేమీ కాదు. మాది క్లీన్ మూవీ, అందరికీ నచ్చుతుంది. నా కష్టం నచ్చితే నన్ను దయచేసి ఆదరించండి' అని అన్నాడు. మరి బూతు పదాలను పాటలో ఇరికించి పాడి, ఇప్పుడు ఆ పదాలకు కట్టుబడి ఉంటానంటూ చంద్రహాస్ చేసిన తాజా వ్యాఖ్యలపై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated Date - Feb 04 , 2026 | 07:26 PM