20 యేళ్ళ తర్వాత ఎఫ్.డి.సి.కి జవసత్వాలు!
ABN , Publish Date - May 24 , 2026 | 11:12 AM
ఎ.పి.ఎఫ్.డి.సి.కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేశారు. ఛైర్మన్ ను నియమించి ఊరుకోకుండా సినిమా రంగానికే చెందిన డైరెక్టర్లను నియమించారు.
సినిమా రంగానికి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్.డి.సి.కి ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉండేవి. సినీ దిగ్గజాలు దానికి ఛైర్మన్లుగా సేవలు అందించారు. నంది అవార్డుల నిర్వహణ సైతం ఎఫ్.డి.సి. నిర్వహిస్తుండేది. కేవలం సినిమా రంగానికి పరిమితం చేయకుండా టీవీ, నాటక రంగాలను సైతం అందులో కలిపి, వాటి అభివృద్ధి బాధ్యతలనూ ఎఫ్.డి.సి.కి అప్పగించారు. సినిమాలతో పాటు నాటక, టీవీ రంగాలకు నంది అవార్డులను ఆ సమయంలో ఇచ్చేవారు. అయితే తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడిన తర్వాత ఎఫ్.డి.సి. నామమాత్రంగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం ఛైర్మన్లను మాత్రమే నిర్మించి, ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. తెలంగాణలోనూ 2024లో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజును ఎఫ్.డి.సి. ఛైర్మన్‌గా నియమించారు తప్పితే... డైరెక్టర్లను ఏర్పాటు చేయలేదు.
అయితే ఇప్పుడు ఏపీలో రెండోసారి సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఎఫ్.డి.సి.కి పూర్తి స్థాయిలో జవసత్వాలను నింపే ప్రయత్నం చేశారు. ప్రముఖ పంపిణీ దారుడు భరత్ భూషణ్ ను ఛైర్మన్ గా నియమిస్తూ శనివారం జీవో విడుదల చేశారు. ఆయనతో పాటుగా పద్నాలుగు మందిని డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. గతంలో ఎఫ్.డి.సి.కి డైరెక్టర్లుగా పదిహేను, ఇరవై మందిని నియమించినా, అందులో అత్యధిక శాతం సినిమా రంగానికి సంబంధం లేని వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు సినిమా రంగంలోని దాదాపు పది విభాగాలకు సంబంధించిన వారిని డైరెక్టర్లుగా నియమించారు.

తొలుత ఎఫ్.డి.సి. వైస్ ఛైర్మన్ గా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ పేరును ప్రకటించారు. అయితే ఎఫ్.డి.సి.లో ఆ పదవి లేకపోవడంతో చివరి నిమిషంలో ఆయనికి కూడా డైరెక్టర్ హోదానే ఇచ్చారు. మెహర్ రమేశ్ తో సహా డైరెక్టర్ గా నియమితులైన వారంతా సినిమా రంగంలోని వివిధ శాఖలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం పది విభాగాల నుంచి డైరెక్టర్లను నియమించడం ఇదే మొదటిసారి. సినిమా నటులు సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఎఫ్.డి.సి. డైరెక్టర్లుగా చోటు దక్కింది. సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు చదలవాడ శ్రీనివాసరావు, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద; రచయిత సాయిమాధవ్ బుర్రాని డైరెక్టర్లుగా ఎంపిక చేశారు. దర్శకుడు సముద్ర, సీనియర్ పాత్రికేయుడు కె. ఉమా మహేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్ ఎస్. మీర్ కూడా డైరెక్టర్లుగా నియమితులయ్యారు. నాటకరంగానికి చెందిన కందిమళ్ళ సాంబశివరావు, ఎగ్జిబిటర్లు ఎస్. వెంకట కృష్ణారెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, వైజాగ్ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేత డి. సత్యనారాయణ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరుతో పాటు ముగ్గురు ప్రభుత్వ అధికారులూ ఎఫ్.డి.సి. డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన డైరెక్టర్లు అందరూ సినిమా రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారే. అలానే ఎఫ్.డి.సి. పూర్వ వైభవం కోసం తగిన సమయం ఇవ్వగలిగిన వారే కావడం విశేషం.
ఎ.పి. ఎఫ్.డి.సి. ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్లంతా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఉన్న ఎఫ్.డి.సి. కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రముఖ కథానాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సలహా, సూచనలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... ఎ.పి. ఎఫ్.డి.సి. ని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.