NTR: ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త...
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:45 AM
చెన్నయ్ బజుల్లా రోడ్ లోని ఎన్టీఆర్ ఇంటిని ఇటీవల చదలవాడ బ్రదర్స్ కొనుగోలు చేశారు. ఆ ఇంటిని అలా ఉంచి దానికి మెరుగులు దిద్దుతున్నారు. ఎప్పటికీ అది ఎన్టీఆర్ ఇల్లు లానే ఉంటుందని చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్ళిన భక్తుల యాత్రకు పరిపూర్ణత లభించేది చెన్నయ్ లోని నందమూరి తారక రామారావు (Nandamuri Tharaka Ramarao)ను కన్నులారా వీక్షించిన తర్వాతే! ఇది మొన్నటి తరం సినీ అభిమానులు ఆనందంగా చెప్పే మాట. తిరుపతి నుండి బస్సుల్లో చెన్నయ్ వెళ్ళి అక్కడ బజుల్లా రోడ్డులోని ఎన్టీఆర్ ను కలిసి, ఆయన ఆశీస్సులు తీసుకుని తిరిగి వారి వారి ఇళ్ళకు వెళ్ళిన తెలుగువారు కోట్లలో ఉంటారు. అయితే చెన్నయ్ లోని అప్పటి ఎన్టీఆర్ (NTR) ఇల్లు... కొన్నేళ్ళుగా కాంతివిహీనంగా మారిపోయింది. ఎన్టీఆర్ చెన్నయ్ వదిలి హైదరాబాద్ కు వచ్చిన కొద్ది రోజులకే ఆ ఇల్లు పాడుబడి పోయింది. ఎన్టీఆర్ వారసులంతా తలో దిక్కు వెళ్ళి పోవడం, చాలా మంది హైదరాబాద్ లో స్థిరపడటంతో చెన్నయ్ ఇంటిని పట్టించుకున్న వారు లేరు. ఏడెనిమిదేళ్ళ క్రితం ఆ ఇంటిని అమ్మకానికి పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. అయితే... తాజాగా ఎన్టీఆర్ ఇల్లు కొత్త సొబగులు దిద్దుకుంటోంది. తిరిగి ప్రజల సందర్శనార్థం సిద్థమౌతోంది.

నందమూరి తారక రామారావుకు బజుల్లా రోడ్ లోని ఇల్లు ఎంతో కలిసి వచ్చింది. దాదాపు వెయ్యి గజాల వైశాల్యం ఉన్న ఆ ఇంటి ఎదురుగానే దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) ఇల్లు ఉండేది. ఇప్పుడు అది షాపింగ్ కాంప్లెక్స్ గా మారిపోయింది. అయితే... ఎన్టీఆర్ ఇంటిని కొంతమంది కొనాలని చూసినా రకరకాల కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా నందమూరి కుటుంబానికి సన్నిహితులు, బంధువులు అయిన చదలవాడ బ్రదర్స్ తిరుపతిరావు, శ్రీనివాసరావు చొరవ చూపి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. దీని వెనుక చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.

ఇటీవల మీడియా మిత్రులు కలిసినప్పుడు చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasarao) ఈ ఇంటి కొనుగోలు విషయమై ఇలా చెప్పారు. 'రెండేళ్ళ క్రితం 'రికార్డ్ బ్రేక్' సినిమాను స్వీయ దర్శకత్వంలో నేను ప్రొడ్యూస్ చేశాను. దాని పని మీద తుమ్మల ప్రసన్న కుమార్ (Thummala Prasanna Kumar) తో కలిసి చెన్నయ్ వెళ్ళాను. బజుల్లా రోడ్ లో నుండి మా కారు వెళుతుంటే... ఆ వీధిలో ఉన్న ఎన్టీఆర్ గారి ఇల్లు చూడాలనే కోరిక కలిగింది. ఎందుకంటే ఆ ఇంటితో నాకున్న అనుబంధం చాలా పాతది. నేను, అన్నయ్య యుక్త వయసులో ఉండగా... తెనాలి నుండి తిరుపతికి బస్సులు నడిపే వాళ్ళం. తిరుమలకు అయితే మనిషికి వంద రూపాయలు, చెన్నయ్ వెళ్ళి ఎన్టీఆర్ గారిని కూడా చూసి రావాలంటే 150 రూపాయలు ఛార్జ్ చేసే వాళ్ళం. ఆ రకంగా అనేక సార్లు ఎన్టీఆర్ ఇంటికి యాత్రికులతో వచ్చి ఆయన్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా ఆ ఇంటిని చూడగానే నా మనసులో మెదిలాయి. ఆ ఇంటి గేటు తీసుకుని లోపలి వెళుతుంటే వాచ్ మ్యాన్ మమ్మల్ని ఆపాడు. అతనికి ప్రసన్న కుమార్ కానీ నేను గానీ ఎన్టీఆర్ బంధువులమని తెలియదు. దాంతో ప్రసన్న... మోహన్ కృష్ణగారితో ఫోన్ లో మాట్లాడి, ఆ ఇంటి లోపలకు వెళ్ళే ఏర్పాటు చేశాడు. ఆ ఇంటిని చూసిన తర్వాత దాన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలనే కోరిక కలిగింది. బేరసారాలకు తావు లేకుండా ఎన్టీఆర్ వారసులు ఎంత కోరుకుంటే అంత ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే ఎన్టీఆర్ ఇంటిని నేను వ్యాపార కేంద్రంగా మార్చుకోవాలని అనుకోలేదు. దశాబ్దాల క్రితం నేను ఆ ఇంటిని ఎలా అపురూపంగా చూశానో... అలానే మరోసారి చూసుకోవాలని భావించాను. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా దాన్ని 'ఎన్టీఆర్ ఇల్లు'గానే ఉంచాలని అనుకున్నాను. నా ఈ ఆలోచనను ఎన్టీఆర్ వారసులకు ప్రసన్న కుమార్ చెప్పడంతో వారూ సంతోషంగా ఆ ఇంటిని మాకు ఇవ్వడానికి అంగీకరించారు. అలా ఇటీవలే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి' అని చెప్పారు.
ఎన్టీఆర్ ఇంటికి మరమత్తులు
మహానటుడు ఎన్టీఆర్ ఇంటికి సంబంధించిన రాతకోతలు పూర్తి అయిన మరుక్షణం చదలవాడ శ్రీనివాసరావు ఆ ఇంటికి మరమత్తులు చేయించే పని ప్రారంభించారు. ఇంటి స్ట్రక్చర్ ను మార్చకుండా గతంలో ఎలా ఉందో అలానే ఉంచుతూ, దానికి సరికొత్త సొబగులు అద్దడం మొదలు పెట్టారు. ఆ ఇంటిని పూర్తి స్థాయిలో సరికొత్త భవనంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఇంటి ప్రధాన ద్వారం పైన 'శ్రీకృష్ణపాండవీయం'లో సుయోధనుడిగా నటించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయబోతున్నారు.

ప్రస్తుతం బజుల్లా రోడ్డులో ఎన్టీఆర్ ఇంటి ముందు ఓ ఫ్లై ఓవర్ ఉంది. దాని పైనుండి వెళ్ళే వారు సైతం ఎన్టీఆర్ ఇంటిని చూసే విధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. 'త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి అవుతాయని, దాంతో గతంలో మాదిరిగానే తిరుపతి నుండి చెన్నయ్ వచ్చే వారు ఎవరైనా ఎన్టీఆర్ ఇంటిని చూసి ఆనందించేలా ఏర్పాట్లు చేస్తున్నామ'ని చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.

మూడు రెట్లకు కొత్త ఆఫర్

చెన్నయ్ లోని ఎన్టీఆర్ ఇంటి అమ్మకంపై గతంలో సోషల్ మీడియాలో కొంత చర్చ జరిగింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఇంటిని చదలవాడ సోదరులు కొనుగోలు చేయడంపై కొందరు కూనిరాగాలు తీస్తున్నారు. దీనిపై తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ ఇంటిని వారి బంధువులకే వారసులు అమ్మారు తప్పితే బయటివారికి కాదు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే... ఆ ఇంటిపై ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎన్టీఆర్ గుర్తుగా దాన్ని అలానే ఉంచాలనే సంకల్పం శ్రీనివాసరావు గారిది. అందుకే ఎన్టీఆర్ వారసులు సైతం ఆ ఇంటిని వారికి అమ్మడానికి అంగీకారం తెలిపారు. ఇక ఇందులో విమర్శలకు తావేలేదు. చిత్రం ఏమంటే.. చదలవాడ బ్రదర్స్ ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలిసిన తర్వాత కొందరు దానికి మూడొంతుల మొత్తం ఇస్తామని, ఆ ఇంటిని తమకు అమ్మమని శ్రీనివాసరావు గారికి ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన 'ఎన్టీఆర్ ఇల్లు'ను అలానే ఉంచాలనే కృతనిశ్చయంతో వాటన్నింటినీ తిరస్కరించారు. అతి త్వరలోనే మనమంతా ఎన్టీఆర్ ఇంటిని మరోసారి సరికొత్త అందాలతో వీక్షించొచ్చు. ఇది ఎన్టీఆర్ కు మాత్రమే లభించిన గౌరవం' అని చెప్పారు.