2025 Rewind: నోరు జారి... క్షమాపణలు చెప్పి...

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:27 PM

2025లో పలువురు సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు వివాదాలకు తెర తీశాయి. అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, శివాజీ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు తమ వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు.

2025 Cortroversies

గడిచిన సంవత్సరాన్ని మనోభావాలు దెబ్బతిన్న సంవత్సరంగా ప్రకటించొచ్చేమో! సహజంగా సినిమా రంగంలోని వారి వ్యాఖ్యల కారణంగా సమాజంలో ఓ వర్గం మనోభావాలు దెబ్బతినడం మనం చూశాం. కానీ లాస్ట్ ఇయర్ చిత్రంగా సినిమా వాళ్ళే... సినిమా వాళ్ళ మననోభావాలు దెబ్బతినే రీతిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో కొందరు తమ తప్ప తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. మరి కొందరు సంబంధిత కమీషన్ల సభ్యుల దగ్గరకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

గత యేడాది ప్రారంభంలోనే జనవరి 2న నటుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. శేఖర్ ఓ పాత్రికేయురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రత్యేక కోర్టు ఆయనకు నెల రోజుల జైలు శిక్ష విధించింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పై ఇచ్చిన ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్టించుకోలేదంటూ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) వివాదాస్పద ప్రకటన చేసింది. అయితే తమకు ఆమె నుండి ఎలాంటి ఫిర్యాదు లేదని, నిజానికి ఆమె ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తే బెటర్ అని జనవరి 5న 'మా' తెలిపింది. డిసెంబర్ నెలాఖరులోనూ త్రివిక్రమ్ కు సంబంధించిన ప్రమోషనల్ వీడియో క్రింద ఆమె మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. నటి మాధవీలత (Madhavi Latha) తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ కమీషనరేట్ లో జనవరి 21న ఫిర్యాదు చేసింది. అదే రోజున వేణు స్వామి (Venu Swamy) తెలంగాణ మహిళా కమీషనర్ వద్దకు వెళ్ళి గతంలో తాను నటీనటులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపాడు.


ఫిబ్రవరి 10న నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన 'తండేల్' మూవీ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్‌ (Ram Charan) ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీశాయి. దాంతో పొరపాటును గ్రహించిన అల్లు అరవింద్ వెంటనే మీడియా ముఖంగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, చెర్రీ అభిమానులకు సారీ చెప్పారు. అదే రోజున 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'ఖడ్గం' పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వై.యస్.ఆర్.సీ.పి. కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతని తరఫున హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) క్షమాపణలు చెప్పాడు. ఫిబ్రవరి 12న ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో వివాదం చోటుచేసుకుంది. 2018 నుండి ఛైర్మన్ గా ఉంటున్న మోహన్ బాబును ఆ పదవినుండి తొలగించాలని ఆయన నిర్వహణ చేస్తున్న విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. ఆయనకు ఆ హక్కులేదని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో స్వామీజీ కోర్టు తలుపుతట్టారు. ఫిబ్రవరి 26న పొలిటీషియన్స్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలు దెబ్బతీసిన పోసాని కృష్ణమురళీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలు వివాదా స్పదం కావడంతో రాజేంద్ర ప్రసాద్ మార్చి 25న క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత కూడా అలీని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అది కూడా వివాదానికి దారి తెరలేపింది. ఏప్రిల్ 22న 'పాడుతా తీయగా' సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ నుండి ఎలిమినేట్ అయిన గాయని ప్రవస్తి న్యాయ నిర్ణేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై సునీత, కార్యక్రమ నిర్వాహకులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.


మే 15వ తేదీ 'డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్' మూవీలోని 'శ్రీనివాసా గోవిందా' పాట వివాదాస్పదమైంది. వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అది ఉండటంతో టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్‌ ఆ ఫిల్మ్ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపి, ఆ పాటను తీసేయించారు. మే 22న ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో దీపికా పదుకొణే స్థానంలో తృప్తి డిమ్రీని తీసుకున్నారు. దీపికా డిమాండ్స్ కు తలొగ్గలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేకర్స్ చెబితే, పనిగంటల విషయంలో తాను రాజీపడలేనని దీపికా బదులిచ్చింది. ఆ తర్వాత ఆమెను ప్రభాస్ మరో చిత్రం 'కల్కి 2' నుండి కూడా తొలగించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు వ్యతిరేకంగా సినిమా రంగంలో కొందరు ప్రవర్తించడం పట్ల నాగవంశీ, బన్నీ వాసు వంటి వారు మే 24న ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఆఫీస్ సైతం థియేటర్ల నిర్వహణపై దృష్టి పెడతామని హెచ్చరించింది. మీడియాలో ప్రాచారం జరుగుతున్నట్టు 'ఆ నలుగురు'లో తాను లేనని మే 25న అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. దిల్ రాజు సైతం ఏపీ డిప్యూటీ సీఎం తనకు పెద్దన్న అని మీడియా మీట్ చెప్పారు.

'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు కన్నడిగులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. కమల్ సినిమాను విడుదల కాకుండా వారు కర్ణాటకలో అడ్డుకున్నారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను సైతం జూన్ 3న కర్ణాటక హై కోర్ట్ తప్పుపట్టింది. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే కమల్ సినిమాను కర్ణాటకలో విడుదలచేసేలా చర్యలు తీసుకోమని సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 14న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డులలో కొందరు సినీ ప్రముఖులు హాజరు కాకపోవడంపై ఎఫ్‌.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వాన్ని అవమానించడంగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. 'రెట్రో' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ట్రైబల్ కమ్యూనిటీని ఆయన కించపరిచారంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 4 ఎక్స్ వేదికగా నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) పెట్టిన పొలిటికల్ కామెంట్స్ దుమారం రేపాయి. దాంతో ఆయన వాటిని తొలగించారు. ఇక మీదట తాను ట్విట్టర్ కు దూరంగా ఉంటానని, సినిమాలపైనే దృష్టి పెడతానని వివరణ ఇచ్చాడు. అదే నెల 12న మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) పై 'మా' కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీకాంత్ అయ్యంగార్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు.


సీనియర్ నటుడు నాగార్జున (Nagarjuna) పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆమె అక్టోబర్ 13న క్షమాపణలు తెలిపారు. దాంతో నాగార్జున ఆమెపై పెట్టిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకున్నారు. 'మోగ్లీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెన్సార్ బృందంపై నటుడు బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) చేసిన వ్యాఖ్యలపై సి.బి.ఎఫ్‌.సి. అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో డిసెంబర్ 10న సరోజ్ కుమార్ తో పాటు ఆ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 15న ప్రముఖ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ముందుకు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలను కొందరు చేశారు. అయితే పరస్పరం విమర్శలు ప్రతివిమర్శలు జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఈ వివాదం సద్దుమణిగింది. డిసెంబర్ 22న 'దండోరా' ప్రీ రిలీజ్ లో శివాజీ (Shivaji) చేసిన వ్యాఖ్యలు సైతం పెద్ద వివాదానికి దారితీశాయి. మహిళల మనోభావాలను శివాజీ కించపరుస్తున్నాడంటూ కొందరు సినీ ప్రముఖులు అతన్ని విమర్శించారు. మరికొందరు 'మా'కు ఫిర్యాదు చేశారు. దాంతో శివాజీ క్షమాపణలు చెప్పడంతో పాటు, మహిళా కమీషన్ కు కూడా వెళ్ళి వివరణ ఇచ్చాడు. ఈ యేడాది అలా కొందరు జర్నలిస్టులు సైతం వివాదాలలో చిక్కుకున్నారు. మంచు లక్ష్మీ (Manchu Laxmi) ని ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఆమె మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అలానే నిర్మాతలు బండ్ల గణేశ్‌, బన్నీ వాసు, దర్శకుడు మారుతీ, సాయిలు కంపాటి వంటి వారు కొన్ని ఈవెంట్స్ తో ఆవేశంతో చేసిన వ్యాఖ్యలకు ఆ తర్వాత నొచ్చుకుంటూ సారీ చెప్పి... ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన సందర్భాలు సైతం కొన్ని జరిగాయి. మరి ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి వివాదాలకు తెర లేస్తుందో... ఎవరెవరు ఎవరెవరి మనోభావాలను దెబ్బతినే వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

Updated Date - Jan 02 , 2026 | 12:37 PM