Bhagiratha: బయోపిక్ ను తలపించే 'మీర్జాపురం రాణి కృష్ణవేణి'

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:33 PM

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, రచయిత భగీరథ రచించిన 'మీర్జాపురం రాణి కృష్ణవేణి' పుస్తక పరిచయ కార్యక్రమం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని రచయితను అభినందించారు.

Mirzapuram Rani Krishnaveni Book

సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన 'మీర్జాపురం రాణి కృష్ణవేణి' (Mirzapuram Rani Krishnaveni ) పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ, 'ఎన్. టి. రామారావు (NT Ramarao) గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో గౌరవం, అలాంటి కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను వెలువరించిన భగీరధను, నిర్మాత అనురాధాదేవిని నేను మనసారా అభినందిస్తున్నాను. 'శకపురుషుడు, తారకరామం, నాగలాదేవి, మీర్జాపురం రాణి కృష్ణవేణి లాంటి పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన భగీరథ డాక్టరేటుకు అర్హుడు, నేను యూనివర్సిటీ లో ఉంటే డాక్టరేట్ ఇప్పించేవాడిని' అని ఆయన అన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ, 'భగీరథ చేయి తిరిగిన రచయిత, రామారావు గారి శత జయంతి సందర్భగా వెలువరించిన శకపురుషుడు, తారకరామం పుస్తకాలు ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆయన రచన నాగలాదేవి, మీర్జాపురం రాణి కృష్ణవేణి ఈ రెండు పుస్తకాలు ఆయనలోని గొప్ప పరిశోధకుడిని మనకు పరిచయం చేస్తాయి. ఈ పుస్తకం చదివితే ఓ బయోపిక్ ను చూసిన అనుభూతి కలుగుతుంది' అని చెప్పారు.


దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ, 'భగీరథ నాకు ఇష్టమైన జర్నలిస్టు, రచయిత. ఆయన రాసిన పుస్తకాలన్నీ నేను చదివాను. రచయితగా ఆయనది ఎంతో విలక్షణమైన శైలి. ఈ మీర్జాపురం రాణి కృష్ణవేణి పుస్తకంలో కృష్ణవేణమ్మ జీవితంతో పాటు తెలుగు సినిమా చరి త్రను కూడా మన కళ్ల ముందు నిలబెట్టారు' అని అన్నారు. నటి రోజారమణి (Roja Ramani) మాట్లాడుతూ, 'కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో అభిమానం, ఆమె మాలాంటి నటీమణులకు ఆదర్శం. బాలనటిగా నాకు ఆమె స్ఫూర్తి, అనురాధాదేవి నిర్మించిన పలు చిత్రాలకు నేను డబ్బింగ్ చెప్పాను' అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ, 'మీర్జాపురం రాణి కృష్ణవేణి పుస్తకాన్ని గత నెల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు, ఆరోజున భగీరథ గారంటే చంద్ర బాబు నాయుడు గారికి ఎంత అభిమానమో నేను ప్రత్యక్షంగా చూశాను, ఈ రోజు ఈ పుస్తకం గురించి ఇంతమంది వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తుంటే కళారత్న భగీరథ ఎంత పరిశోధన చేసి ఈ గ్రంధాన్ని వెలువరించారో అర్థమవుతుంది' అని అని చెప్పారు. ప్రొఫెసర్ ఆర్. దేవన్న మాట్లాడుతూ, 'భగీరథ రచించిన నాగలాదేవి చదివిన తరువాత ఆయన అభిమానిగా మారాను. బళ్లారిలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు ఆ నవలను పాఠ్యాంశం గా ప్రవేశపెట్టాం, ఈ మీర్జాపురం రాణి పుస్తకంలో ముందుమాట రాసే అవకాశం ఇచ్చిన భగీరథ గారికి కృతజ్ఞతలు' అని అన్నారు. పుస్తక రచయిత భగీరథ మాట్లాడుతూ, 'మీర్జాపురం రాణి కృష్ణవేణి పుస్తకాన్ని రాయడానికి ప్రధాన కారకురాలు శ్రీమతి అనురాధ దేవి. ఆమె సహకారం లేకపోతే ఈ గ్రంథం వెలువడేదే కాదు, కృష్ణవేణమ్మది విలక్షణమైన జీవితం. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యురాలుగా ఎదిగి ఒదిగిన మహానటి. ఆమె జీవితం ఈ తరం వారందరికీ స్ఫూర్తి దాయకం' అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాగంటి మురళీ మోహన్ (Maganti Murali Mohan), కె .ఎస్ .రామారావు, కైకాల నాగేశ్వర రావు, కె .అశోకుమార్, రాశీ మూవీస్ నరసింహా రావు, డి. వి. కె రాజు, అట్లూరి నాగేశ్వరరావు, అక్కినేని నాగ సుశీల, కాజా సూర్యనారాయణ, తుమ్మల రంగారావు, సారిపల్లి కొండలరావు, విజయలక్ష్మి పండిట్, బిక్కి కృష్ణ, రామలక్ష్మి, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత భగీరథ ను జర్నలిస్ట్ మిత్రులు ఆత్మీయంగా సత్కరించారు.

Updated Date - Feb 05 , 2026 | 11:33 PM