దిల్జిత్ దోసాంజ్ కాన్సర్ట్‌కు బాంబు బెదిరింపులు.. బెంగళూరులో కలకలం
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:46 PM
దిల్జిత్ దోసాంజ్ బెంగళూరు కాన్సర్ట్‌కు ఐఈడీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఖలిస్థాన్ జిందాబాద్ పేరుతో వచ్చిన మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) సంగీత ప్రదర్శనకు బాంబు బెదిరింపులు (Bengaluru Bomb Threat) రావడం కలకలం రేపుతోంది. ఈ నెల 29న బెంగళూరులో జరగనున్న ఆయన కాన్సర్ట్ (Bengaluru Concert) ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపించారు. కార్యక్రమంలో ఐఈడీ (IED) బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని మాదావర ప్రాంతం, నైస్ రోడ్డు సమీపంలోని మైదానంలో ఈ నెల 29న దిల్జిత్ దోసాంజ్ సంగీత ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో ధారవాడ పోలీస్ కమిషనర్‌తో పాటు పలువురు ప్రేక్షకులకు మంగళవారం బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ-మెయిల్స్‌లో 'ఖలిస్థాన్ జిందాబాద్' అనే నినాదాన్ని ప్రస్తావించడంతో పాటు, కార్యక్రమానికి వచ్చే వారు పిల్లలను తీసుకురావద్దని హెచ్చరించారు.
ఐఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దని, మెట్రో రైళ్లలో ప్రయాణించవద్దని కూడా సూచించారు. ఈ బెదిరింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వీటి వెనుక ఎవరున్నారు? నిజంగానే ఏదైనా కుట్రకు తెరతీశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాన్సర్ట్ జరిగే ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
గతంలోనూ ఇదే తరహా బెదిరింపులు
ప్రస్తుతం దిల్జిత్ దోసాంజ్ 'ఆరా ఇండియా టూర్-2026' పేరుతో దేశవ్యాప్తంగా సంగీత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆయన కార్యక్రమాలకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, ఈ పర్యటనలో భాగంగా గతంలోనూ ఇలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ నెల 15న ఇండోర్‌లో నిర్వహించిన కార్యక్రమంతో పాటు, ముంబైలో జరిగిన కాన్సర్ట్‌కు కూడా బెదిరింపు సందేశాలు వచ్చాయి. అయితే పోలీసుల విచారణలో అవి నకిలీ బెదిరింపులుగా తేలాయి.
మరోవైపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దిల్జిత్ నిర్వహించిన కార్యక్రమంలో దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగ్జరీ మొబైల్ ఫోన్లను చోరీ చేయడమే లక్ష్యంగా ఢిల్లీ నుంచి వచ్చినట్లు గుర్తించారు. వరుస ఘటనల నేపథ్యంలో బెంగళూరు కాన్సర్ట్‌కు పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.