బాపు బొమ్మ దివ్యవాణి... విశ్వ మహిళ అవార్డ్స్‌!

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:53 PM

ప్రముఖ నటి దివ్యవాణి 'బాపు బొమ్మ - విశ్వ మహిళ' పేరుతో ప్రముఖ మహిళలకు అవార్డులను అందించారు. ఇందులో తొలి అవార్డును చిరంజీవి తల్లి అంజనాదేవికి ఇవ్వడం విశేషం.

Divyavani

బాపు బొమ్మగా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుని, సామాజిక, రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్న ప్రముఖ నటీమణి దివ్యవాణి చౌదరి (Divyavani Chowdary). అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె 'బాపు బొమ్మ - విశ్వ మహిళ' పేరిట 2026 వ సంవత్సరానికిగాను అవార్డ్స్ ప్రదానం చేశారు.


తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishnarao) సౌజన్యంతో హైదరాబాద్, దసపల్లా హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ (Mahesh Goud), తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్, ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్. కిరణ్ కుమార్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'బాపు బొమ్మ - విశ్వ మహిళ' తొలి అవార్డును దివ్యవాణి చిరంజీవి (Chiranjeevi) తల్లి అంజనాదేవికి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆమె తరఫున చిరంజీవి సోదరి మాధవి ఈ అవార్డును అందుకున్నారు. అలానే ఇదే వేదికపై రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) సతీమణి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యు.ఎస్.ఎ), డాక్టర్ వెన్నెల గద్దర్, డా. పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఎ.) తదితర మహిళామణులు పురస్కారాలను స్వీకరించారు.


వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించుకోవడం ద్వారా సమాజంలోని సాటి మహిళామణులందరిలో స్ఫూర్తిని రగిలించాలనే వజ్ర సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దిగ్విజయం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ దివ్య వాణి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దివ్యవాణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 'బాపు బొమ్మ - విశ్వమహిళ అవార్డ్స్' వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని దివ్యవాణి ప్రకటించారు.

Updated Date - Mar 11 , 2026 | 04:07 PM