Rgv, A.R Rahman: ఆర్జీవీ ఎంట్రీ.. రగులుతున్న రావణ కాష్టంలా రెహమాన్ వ్యవహారం
ABN , Publish Date - Jan 20 , 2026 | 07:49 PM
ఎ. ఆర్. రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కారణంగా చెలరేగిన వివాదం ఇంకా ముగిసిపోలేదు. పాత ముచ్చట్లను ఈ సందర్భంగా వెలుగులోకి తెచ్చి దీనిని ఇంకా సజీవంగా ఉంచే ప్రయత్నం కొందరు చేస్తున్నారు.
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడిచిపోయినా ఇంకా సోషల్ మీడియాలో మాత్రం ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఈ దేశం తనకు గురువు లాంటిదని, ఇదే తన ఇల్లు అని రెహమాన్ వివరణ ఇచ్చినా... కొందరు ఇంకా ఈ చిచ్చును రాజేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రెహమాన్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని కొందరంటున్నారు. మలయాళ సంగీత దర్శకుడు కైలాష్ మీనన్ ఈ విషయంలో రెహమాన్ కు బాసటగా నిలిచాడు. 'మీకు నచ్చకపోతే రెహమాన్ వ్యాఖ్యలతో విభేదించండి... కానీ ఆయన్ని అవమానించకండి' అనే పేర్కొన్నాడు. అదే పోస్ట్ ను రెహమాన్ కుమార్తెలు రీ-పోస్ట్ చేస్తూ 'తమ తండ్రి అనుభవంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తప్పుపట్టడం సరికాదని అన్నారు. ఆయన స్వేచ్ఛను హరించడం దగదని హితవు పలికారు. ఇక 'లజ్జా' (Lajja) నవలతో భారతదేశమంతటినీ తన వైపు తిప్పుకున్న తస్లీమా నస్రీన్... రెహమాన్ వంటి వారికి వివక్ష అనే సమస్యే రాదని చెప్పారు. 'ఆయన భారతదేశంలో ప్రముఖ వ్యక్తి. సంపన్నుడు. నాకు తెలిసి సంగీత దర్శకుడిగానూ ఆయన అధిక పారితోషికం తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సమస్యలు ఎదురుకావు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan), జావెద్ అక్తర్... వీళ్ళవంటి సూపర్ స్టార్స్ కు, సంపన్నులకు ఎలాంటి సమస్యలు రావు' అని ఆమె అభిప్రాయపడ్డారు. రెహమాన్ ను అన్ని మతాల వారు గౌరవిస్తారని తస్లీమా నస్రీన్ అన్నారు.
చిత్రం ఏమంటే... రెహమాన్ వ్యాఖ్యల కారణంగా గతంలోని కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) 'రంగీలా' సినిమాకు ఎ.ఆర్. రెహమానే సంగీతం అందించారు. ఆనాటి అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 'రంగీలా' మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం తాము గోవా వెళ్ళామని, ఐదు రోజులు గడిచినా రెహమాన్ బాణీలు అందించలేదని, ఆ సమయంలో తమ మధ్య ఇస్లాంకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు రెహమాన్ ఉత్సాహాన్ని చూపే వాడని, అలా తాను అతనితో పనిచేయించుకున్నానని వర్మ చెప్పాడు. ఆయన అప్పుడెప్పుడో చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలానే ఎ.ఆర్. రెహమాన్ ను, రాజమౌళిని పొగుడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన వీడియోనూ ఇప్పుడు రెహమాన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎ.ఆర్. రెహమాన్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారనే భావనతో వివరణ ఇచ్చారు. దీనికి ఇక ఫుల్ స్టాప్ పెడితే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు సినిమా పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.