Anirudh Ravichander: హైదరాబాదీలను ఉర్రూతలూగించబోతున్న అనిరుధ్‌...

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:28 PM

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్‌ రవిచందర్ హైదరాబాద్ లో గ్రాండ్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో తెలుగు, తమిళ, హిందీ పాటలను తన టీమ్ తో కలిసి అనిరుధ్‌ పాడతాడని తెలుస్తోంది.

Anirudh Ravichander

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander) స్టైలే వేరు. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ (A. R. Rahman) తర్వాత ఆ స్థాయిలో కుర్రకారును తన సంగీతంతో ఓ ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే. తొలి చిత్రం '3' తోనే అనిరుధ్‌ యువత మదిలో పాగా వేశారు. అందులోని 'వై దిస్ కొలవెరి డీ' (Why This Kolaveri Di) పాట సృష్టించిన మాయాజాలం ఇంతా అంతా కాదు. ఆ సినిమా పరాజయం పాలైనా ఈ ఒక్క పాటతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్టాటస్ ను అనిరుధ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులోనూ 'జెర్సీ (Jersey), గ్యాంగ్ లీడర్ (Gang Leader), అజ్ఞాతవాసి, దేవర (Devara), కింగ్డమ్ (Kingdom)' చిత్రాలకు చక్కని బాణీలను అనిరుధ్‌ సమకూర్చాడు. వీటిలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించకపోయినా... మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్‌ మంచి మార్కులే సంపాదించు కున్నాడు. అందుకే ఇప్పటికీ అనిరుధ్‌ తో మ్యూజిక్ చేయించుకోవాలని తపన పడే తెలుగు నిర్మాతలు ఉన్నారు.


ఇదిలా ఉంటే... స్టేజ్ పెర్ఫార్మెన్స్ విషయంలోనూ అనిరుధ్‌ తగ్గేదే లే అంటూ ఉంటాడు. గత యేడాది హైదరాబాద్ లో అనిరుధ్‌ ఓ మినీ కాన్సర్ట్ చేశాడు. దానికి విశేషమైన స్పందన లభించింది. దాంతో తన అభిమానులను మెస్మరైజ్ చేయడానికి ఈ సారి అనిరుధ్‌ గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ కు ప్లాన్ చేస్తున్నాడు. మార్చి 21న హైదరాబాద్ లో ఈ సంగీత విభావరి జరుగబోతోంది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇటు హిందీ, అటు తమిళ పాటలను సైతం అనిరుధ్‌ పాడబోతున్నాడు. ఇక అనిరుధ్‌ స్వరపర్చిన తెలుగు, తమిళ సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో వున్నాయి. వాటన్నింటితో ఈ కాన్సర్ట్ కు హాజరయ్యే వారికి వీనుల విందు ఇవ్వబోతున్నాడు అనిరుధ్!

Updated Date - Jan 28 , 2026 | 04:10 PM