Controversy: రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ!

ABN , Publish Date - Jan 05 , 2026 | 05:05 PM

నటి రాశికి, పాపులర్ యాంకర్ అనసూయ క్షమాపణలు చెప్పింది. మూడేళ్ళ క్రితం ఓ టీవీ షోలో రాశి గురించి తాను తెలియక డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది.

Anasuya - Raasi

పాపులర్ యాంకర్, నటి అనసూయ (Anasuya) సీనియర్ నటి రాశి (Rasi) కి క్షమాపణలు చెప్పింది. గతంలో ఓ టీవీ షోలో నటి రాశిని ఉద్దేశించి, 'రాశి ఫలాలు' (Raasi Phalalu) అంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తోటి నటి గురించి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పిన అనసూయ ఇవాళ స్త్రీల గురించి, వారి ఆత్మాభిమానం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ కొందరు ఆనాటి వ్యాఖ్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో రాశి సైతం దీనిపై స్పందించింది. అనసూయ ఆ రోజున ఎలాంటి సంబంధం లేని తనను సంభోదించిన తీరు బాధకు గురిచేసిందని రాశి తెలిపింది. దీంతో అనసూయ మరింతగా ట్రోలింగ్ కు గురైంది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని నివారించడం కోసం అనసూయ తిరిగి రంగంలోకి దిగింది. స్వయంగా రాశిని ఉద్దేశించి, తాను చేసిన తప్పుకు క్షమాపణలు కోరింది.


ఇన్ స్టాగ్రామ్ లో అనసూయ... రాశిని ఉద్దేశించి 'మూడు సంవత్సరాల క్రితం ఒక షోలో తెలుగు సరిగ్గా రాని తనం కారణంగా మీ పేరును నా ద్వారా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చెప్పించారు. నిజానికి అలా రాసిన డైరెక్టర్ ను నేను ఆ రోజే నిలదీసి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. దయచేసి నా క్షమాపణలను స్వీకరించండి. మనుషుల్లో మార్పు సహజం. అందుకే నేను ఆ షోలో ద్వంద్వార్థపు మాటలను ఖండించడంతో పాటు దాన్ని విడిచి వచ్చేశాననే విషయం మీరు గ్రహించగలరు. మహిళ భద్రత గురించి నేను గట్టిగా మాట్లాడుతున్నందుకు నా పై హేట్ క్యాంపైన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణలు చెబుతున్నాను' అని పేర్కొంది. మరి రాశీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదే సమయంలో అనసూయ అప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడేసి, తెలుగు తెలియనితనం అని తప్పించుకోవడం సరైనది కాదని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. మొత్తానికీ హీరోయిన్ల వస్తధారణ విషయంలో శివాజీ (Shivaji) రేపిన తుఫాన్ ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు.

anasuya.jpg

Updated Date - Jan 05 , 2026 | 05:05 PM