ANR Lives On: అన్నపూర్ణ ఉద్యోగులతో సంక్రాంతి.. ANR వారసత్వాన్ని కొనసాగిస్తున్న అక్కినేని ఫ్యామిలీ
ABN , Publish Date - Jan 15 , 2026 | 11:34 AM
అక్కినేని నాగేశ్వరరావు యాభై ఏళ్ళ క్రితం ప్రారంభించిన ఓ సత్ సంప్రదాయాన్ని ఆయన వారసులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అన్నపూర్ణ సంస్థ ఉద్యోగులతో కలిసి ఇప్పటికీ వారు సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ మొదలై యాభై యేళ్ళు పూర్తయ్యింది. ప్రతి సంక్రాంతికి ఉద్యోగుల సమక్షంలో సంక్రాంతి పండగను జరుపుకోవడం అక్కినేని నాగేశ్వరరావు (ANR) కు అలవాటు. ఆయన ఇవాళ భౌతికంగా తమ మధ్య లేకున్నా... అక్కినేని కుటుంబ సభ్యులు ఆ వారసత్వ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యేడాది కూడా సంక్రాంతి సందర్భంగా ఐదు దశాబ్దాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించిన ఈ విశిష్ఠ సంప్రదాయాన్ని అనుసరించారు. సంస్థకు పునాది అయిన ఉద్యోగుల పట్ల కృతజ్ఞత వ్యక్తపరిచేలా అక్కినేని దూరదృష్టితో ఆలోచించి ఈ సంప్రదాయనికి అప్పట్లో శ్రీకారం చుట్టారు.


స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా స్టూడియోస్ అంతటా సంక్రాంతి శోభతో అద్భుతంగా అలంకరించగా, ఆ వాతావరణం ఒక మహత్తర కుటుంబ సమ్మేళనాన్ని తలపించింది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఉద్యోగులతో పాటు వారి భార్యాభర్తలు, పిల్లలను కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు అక్కినేని కుటుంబ సభ్యులే స్వయంగా అల్పాహారం వడ్డించడం ఎంతో హృద్యంగా నిలిచింది. ప్రతి ఉద్యోగి సంస్థలో అవిభాజ్య భాగమే అన్న ఏఎన్‌ఆర్ విశ్వాసాన్ని ఈ కార్యక్రమం మరోసారి ఘనంగా ప్రతిబింబించింది.
