న‌టి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి.. కీల‌క సాక్షిపై నిందితుడి స్నేహితుల దాడి, బెదిరింపులు

ABN , Publish Date - Jun 03 , 2026 | 02:21 PM

మాజీ మిస్ పుణె, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక సాక్షిపై నిందితుడి స్నేహితులు దాడికి తెగబడి.. చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Twisha Sharma

మాజీ మిస్ పుణె, నటి ట్విషా శర్మ (Twisha Sharma) అనుమానాస్పద మృతి కేసులో కీలక సాక్షిపై నిందితుడి స్నేహితులు దాడికి తెగబడి.. చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ట్విష భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

భోపాల్ లోని గిరిబాలా సింగ్ ఇంటి సమీపంలో బ్యూటీపార్లర్ నిర్వహించే నీరజ్ దూబే ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు. గత నెల 30న పట్టపగలే బ్యూటీపార్లర్ వద్ద అతడిని చుట్టుముట్టిన సమర్థ్ ఐదుగురు స్నేహితులు... భౌతిక దాడికి పాల్పడ్డారు. 'ఈ హైప్రొఫైల్ కేసులో నువ్వెందుకు సాక్ష్యం చెబుతున్నావ్.. సాక్ష్యం చెబితే చంపేస్తాం' అంటూ బెదిరింపులకు దిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నీరజ్ దూబే ఆరోపించారు. ట్విష మృతికి సంబంధించి సోమవారం గిరిబాలా సింగ్ ఇంట్లో ఓ డమ్మీ బొమ్మ సాయంతో సీబీఐ అధికారులు సీన్ రీక్రియేట్ చేశారు. ఇందుకోసం జైలు నుంచి నిందితులు సమర్థ్, గిరిబాలా సింగ్‌ను ఇంటికి తరలించారు.

మరోవైపు.. ఇద్దరు నిందితులకు మంగళవారం భోపాల్ కోర్టు 14 రోజుల (ఈనెల 16 వరకు) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో భోపాల్ సెంట్రల్ జైలులో వీరిని ఇతర ఖైదీల నుంచి విడిగా ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Updated Date - Jun 03 , 2026 | 02:21 PM