వాయేజర్ యాత్రలో తెలుగు సందేశం.. భారతీయ సంగీతానికి అంతరిక్షంలో చోటు
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:13 AM
వాయేజర్ అంత రిక్ష నౌక నవంబర్ 18వ తేదీకి ఒక కాంతి దినం ప్రయాణించి వార్తల్లో నిలిచిన వేళ.. మన భూమి నుంచి పంపిన సందేశాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి.
వాయేజర్ అంత రిక్ష నౌక నవంబర్ 18వ తేదీకి ఒక కాంతి దినం ప్రయాణించి వార్తల్లో నిలిచిన వేళ.. మన భూమి నుంచి పంపిన సందేశాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. 1977లో మొదలైన ఈ విశ్వాంతర ప్రయాణం వెనుక.. అంతరిక్ష రహస్యాలతో పాటు మన సంగీత వారసత్వం కూడా దాగి ఉంది.
1977లో నాసా పంపిన వాయేజర్ 1, 2 నౌకల ముఖ్య ఉద్దేశం గురు, శని గ్రహాల మీదుగా సౌర కుటుంబానికి ఆవల ఉన్న యురేనస్, నెప్ట్యూన్ మీదుగా వెళ్లి ఇంటర్స్టెల్లార్ (నక్షత్ర మండలాలు) రహస్యాలను అధ్యయనం చేయడం. కార్నెల్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కార్ల్ సాగన్ ఆలోచనలతో, గ్రహాంతర వాసుల అన్వేషణ ప్రాజెక్ట్ స్ఫూర్తితో ఈ ప్రయాణం సాగింది. అంతకుముందు 1971, 72లో పయనీర్ 10, 11 నౌకలలో 6/9 అంగుళాల ఫలకాలతో దృశ్యాలు పంపగా, వాటికి బదులుగా కొత్తగా ఏదైనా పంపాలనే ఆలోచన మొదలైంది.
బంగారు పూతతో గోల్డెన్ రికార్డ్
ఎల్పీ రికార్డుల సాంకేతికతతో 12 అంగుళాల రాగి రికార్డుపై బంగారు పూత పూసి ‘వాయేజర్ ఇంటర్స్టెల్లార్ రికార్డ్’ను తయారు చేశారు. ఒక కమిటీ ద్వారా మానవ ఉనికి, భూగ్రహ విశేషాలు, మన సాంకేతికతను ధ్వనులు, దృశ్యాలుగా బైనరీ పద్ధతిలో రికార్డ్ చేశారు. ఈ ప్రయాణంలో గ్రహాంతర వాసుల దృష్టిలో పడితే భూమి లొకేషన్, రికార్డు వాడే విధానం, శబ్దం వచ్చే తీరు తెలిసేలా గుర్తులు చెక్కి.. కాస్మిక్ కిరణాలు, ఇంటర్స్టెల్లార్ ధూళి నుంచి కాపాడే విధంగా అల్యూమినియం కేసులో భద్రపరిచి రెండు నౌకల్లోనూ పంపారు.
శాంతి సందేశం.. భారతీయ స్ఫూర్తి
యుద్ధం, నేరం, పేదరికం, అంటురోగాలు, వ్యాధుల ప్రస్తావన లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. కార్ల్ సాగన్ పనిచేసే కార్నెల్ యూనివర్సిటీ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ విద్యార్థుల సహాయంతో 55 దేశాల నుంచి ఆయా భాషల్లో సందేశాలు తీసుకున్నారు. అందులో చదువుకుంటున్న తెలుగువాడైన ప్రసాద్ కొడుకుల తెలుగు సందేశాన్ని రికార్డ్ చేయడం మనకు గర్వకారణం. చైనా గోడ, తాజ్‌మహల్, తిమింగలం అరుపులు, గుండె కొట్టుకునే విధానం, తల్లీబిడ్డ దృశ్యాలతో పాటు, అప్పటి అమెరికా అధ్యక్షుడి అక్షర సందేశం, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కర్ట్ వాల్ట్హీమ్ సందేశం, గాయని కేసర్‌బాయి కేర్కర్ భైరవీ రాగంలోని ఖయాల్ ఇందులో నిక్షిప్తమయ్యాయి.

ప్రకృతి ధ్వనులు.. సంగీతం ఎంపిక
‘సౌండ్స్ ఆఫ్ ఎర్త్’ అనే శీర్షిక కింద భూకంపం, ఉరుములు, అగ్ని పర్వతం, గాలి, వర్షం, కప్పలు, పక్షులు, హైనా, ఏనుగు, చింపాంజీ, మనిషి అడుగు చప్పుళ్లు, నవ్వు, తల్లీబిడ్డ ధ్వనులు రికార్డ్ చేశారు. ఎథినో మ్యూజికాలజిస్ట్ రాబర్ట్ బ్రౌన్ సూచనతో పాపులర్ సంగీతాన్ని కాకుండా సంస్కృతిని ప్రతిబింబించే సంగీతాన్ని ఎంచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాశ్చాత్య సంగీత బృందం బీటిల్స్‌లోని జాన్ లెనాన్ పర్యవేక్షణలో ఈ ఎంపిక చేద్దామనుకున్నా.. అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంజినీర్ పర్యవేక్షణలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీత విధ్వాంసులు బాచ్, మోజార్ట్, బీతోవెన్ కృతుల సరసన హిందూస్థానీ గాయని కేసర్‌బాయి ‘జాత్ కహా హో’ ఎంపికైంది. ఈ రికార్డు అమెరికాలో వినడానికి దొరకకపోవడంతో ప్రత్యామ్నాయంగా పాలఘాట్ మణి అయ్యర్ మృదంగ వాయిద్యాన్ని రికార్డులలో చేర్చాలని అనుకున్నారు. అయితే, ఒక స్టోర్‌లో అనుకోకుండా ఈ ఎల్పీ రికార్డు దొరకడంతో దానిని విన్న ఎంపిక కమిటీ దీంట్లో చేర్చారు. ఇదే విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ‘మర్మర్స్ ఆఫ్ ది ఎర్త్’ పుస్తకంలో రాశారు.
ధ్రువతారగా కేసర్‌బాయి
ఈ గోల్డెన్ రికార్డును భూమి నుంచి విశ్వానికి ఒక బహుమతి అని కార్ల్ సాగన్ అభివర్ణించారు. తొలుత పైవ్రేటుగా విడుదల కాని ఈ రికార్డు.. 1992లో అనధికారిక సీడీగా విడుదలైనా అంతగా ప్రాచుర్యం పొందలేదు. కొవిడ్ సమయంలో నాసా అనుమతితో ఓజ్మా రికార్డ్స్ పేరుతో 100 డాలర్లకు మూడు ఎల్పీ (లాంగ్ ప్లే)లుగా విడుదలైంది. హిందూస్థానీ సంగీతంలో హిమాలయ శిఖర సమానుడిగా పేరుపొందిన జైపూర్ ఘరానాకు ఆద్యుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ శిష్యురాలైన కేసర్‌బాయి ఈ గ్రామ్‌ఫోన్ రికార్డు మూడు నిమిషాల పరిమితికి విముఖత కారణంగా.. ఆమె సంగీతం రికార్డు రూపంలో అందుబాటులో లేదు. అయితే, హెచ్ఎంవీ బ్రాడ్కాస్ట్ లేబుళ్ల మీద 17 గ్రామ్‌ఫోన్ రికార్డులు మాత్రమే విడుదలయ్యాయి.
కాల నాళికలో అమర గీతం
బ్రజ భాషలోని ఈ ఖయాల్ ‘జాత్ కహా హో’ అంటే ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అని అర్థం. సౌరమండలాన్ని దాటి నక్షత్ర మండలాల వైపు వెళ్తున్న వాయేజర్కు ఇది ఎంత యాదృచ్చికం! ఈ వాయేజర్ ప్రయాణానికి 15 రోజుల ముందే ఈ గాయని తనువు చాలించడంతో విశ్వాంతరాల్లో తన గానం ప్రతిధ్వనించ బోతున్న విషయాన్ని ఆమె తెలుసుకోలేక పోయారు. ఈ గ్రామ్‌ఫోన్ రికార్డు, నాసా రికార్డు కాపీలు నా అరుదైన సేకరణలో ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను.
రవి పాడి