Resident Evil: భయానికి కొత్త రూపం.. 'రెసిడెంట్ ఈవిల్' ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Jul 23 , 2026 | 07:35 PM
జాక్ క్రెగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రెసిడెంట్ ఈవిల్' కొత్త ట్రైలర్ విడుదలైంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న 'రెసిడెంట్ ఈవిల్' ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమైంది. హారర్ మూవీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం 'రెసిడెంట్ ఈవిల్' (Resident Evil) కొత్త ట్రైలర్ విడుదలైంది. హారర్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జాక్ క్రెగర్ (Zach Cregger) తెరకెక్కిస్తున్న ఈ రీబూట్ మూవీ ట్రైలర్ ఆరంభం నుంచే ఉత్కంఠ, భయానక దృశ్యాలతో, టెన్షన్ పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో ఆస్టిన్ అబ్రామ్స్ (Austin Abrams) ప్రధాన పాత్రలో నటించగా, జాక్ చెర్రీ, కాలీ రీస్, పాల్ వాల్టర్ హౌసర్ కీలక పాత్రలు పోషించారు. అయితే.. ఈ కొత్త చిత్రం గత 'రెసిడెంట్ ఈవిల్' సినిమాలకు కొనసాగింపు కాకుండా లేటెస్ట్‌గా ప్రసంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన వీడియో గేమ్‌ల ఆధారంగా తెరకెక్కించారు.
ఇకవిషయానికి వస్తే.. ఈ ట్రైలర్‌లో మెడికల్ ఓ ఎమర్జెన్సీ మెడికల్ కిట్‌ను తీసుకెళ్తున్న బ్రయాన్ అనే మెడికల్ కొరియర్ అనుకోకుండా జాంబీ వైరస్ వ్యాప్తి చెందిన రాకూన్ సిటీలో ఒక్కడే చిక్కుకుపోతాడు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ప్రతి క్షణం ప్రాణాల కోసం అతను చేసే పోరాటం, జాంబీలు వెంట పడడం వంటి సన్నివేశాలు గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి.
అంతేగాక ఈసారి యాక్షన్ కంటే సర్వైవల్ హారర్‌తో సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇదిలాఉంటే.. ఈ రెసిడెంట్ ఈవిల్ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటుండగా, హారర్ మూవీ అభిమానుల్లో అంచనాలను మరింతగా పెంచుతోంది.