కొత్త జేమ్స్ బాండ్ గాళ్ ఎవరు?రేసులో.. ఫ్లారెన్స్ ప్యూ, జెండయా

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:23 PM

న్యూ జేమ్స్ బాండ్ హీరో ఎవరో తేలిపోయింది. మరి రాబర్ట్ ప్యాటిన్సన్ తో జోడీ కట్టే బాండ్ గాళ్ ఎవరు అన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోన్న అంశం. లక్ ఎవరికి కిక్కిస్తోంది కానీ, పలువురు సుందరాంగుల పేర్లు వినిపిస్తున్నాయి.

bond girls

మొన్నటి వరకూ డేనియెల్ క్రేగ్ (Daniel Craig) తరువాత జేమ్స్ బాండ్ రోల్ (James Bond) లో కనిపించేదెవరో అన్న ఆసక్తి ఉండేది. అమెజాన్-ఎమ్జీఎమ్ (Amazon MGM) సంస్థ రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson) పేరును న్యూ జేమ్స్ బాండ్ గా ప్రకటించగానే పలువురు సినీ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరిసింది. రాబర్ట్ పేరు ఇలా ప్రకటించారో లేదో అలా న్యూ బాండ్ గాళ్ ఎవరు అంటూ మరో చర్చ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పలువురు అందాల భామల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో నేటి క్రేజీ స్టార్ హీరోయిన్స్ జెండయా ( Zendaya), ఫ్లారెన్స్ ప్యూ ( Florence Pugh) పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. వీరి తరువాత అన్యా టేలర్-జాయ్ (Anya Taylor-Joy), సిడ్నీ స్వీనీ (Sydney Sweeney), మార్గరెట్ క్వాలే (Margaret Quallery), ఆడ్రియా ఆర్జోనా (Adria Arjona), హంటర్ స్కాఫర్ (Hunter Schafer), సోఫీ కన్నింగ్ హామ్ (Sophie Cunningham), సాడీ సింక్ (Sadie Sink) పేర్లూ వినిపిస్తున్నాయి. మ‌రికొందరు న్యూ జేమ్స్ బాండ్ మూవీలో బ్యాడ్ గై పాత్రలో బ్రాడ్ పిట్ నటిస్తారనీ అంటున్నారు. వారి ఛాయిస్‌లో న్యూ బాండ్ గాళ్ గా ఫ్లారెన్స్ ప్యూ పేరే వినిపిస్తోంది.

నంబర్ వన్.. ఉర్సులా !

అరవై నాలుగేళ్ళ నుంచీ తెరపై జేమ్స్ బాండ్ మూవీస్ అలరిస్తున్నాయి. వాస్తవానికి ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన జేమ్స్ బాండ్ పాత్రకు సంబంధించిన నవలలు ఎప్పుడో పూర్తయ్యాయి. అయితే జేమ్స్ బాండ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని పలువురు కొత్త కథలు రూపొందించారు. అలా ఇప్పటికి దాకా 25 జేమ్స్ బాండ్ మూవీస్ అధికారికంగా తెరకెక్కాయి. కొందరు జేమ్స్ బాండ్ పోలిన కథలతో మరికొన్ని చిత్రాలు రూపొందించారు. అయినా జేమ్స్ బాండ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

అలాగే జేమ్స్ బాండ్ మూవీస్ లోని అందాల భామలకు కూడా ఎంతో గుర్తింపు ఉంది. జేమ్స్ బాండ్ మూవీస్ లో ప్రప్రథమంగా తెరకెక్కిన 'డాక్టర్ నో'లో షాన్ కానరీ హీరోగా నటిస్తే, అందులో ఉర్సులా ఆండ్రెస్ 'హనీ రైడర్' పాత్ర పోషించి మురిపించారు. ఆ సినిమాలో ఉర్సులా ఒంపుసొంపులు 1962లోనే మగాళ్ళ మతులు పోగోట్టాయి. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఎంతోమంది బాండ్ గాళ్స్ జనాన్ని పులకింప చేశారు. వారిలో ఈ నాటికీ నంబర్ వన్ గా ఉర్సులా ఆండ్రెస్ నిలిచే ఉండడం విశేషం!

రెండో స్థానంలో ఎవా గ్రీన్ !

జేమ్స్ బాండ్ మూవీస్‌లో మొట్టమొదట 'డాక్టర్ నో' 1962లో రిలీజయింది. ఈ చిత్ర దర్శకుడు టెరెన్స్ యంగ్ అందులోని హనీ రైడర్ పాత్ర కోసం పలువురు తారలను పరిశీలించారు. ఉర్సులా ఆండ్రెస్ శరీరసౌష్టవం, అందం, చలాకీతనం ఆమెను హనీ రైడర్‌గా నిలిపాయి. 'డాక్టర్ నో' మూవీని కొందరు ఉర్సులా అందం కోసమే పదే పదే చూశారు. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే తరువాత జేమ్స్ బాండ్ మూవీస్ తెరకెక్కించిన వారు సైతం బాండ్ గాళ్స్ కోసం ప్రత్యేక అన్వేషణ సాగించారు. ఉర్సులా తరువాత అంతటి అందగత్తెగా ఆకట్టుకున్న బాండ్ గాళ్ ఎవరంటే 2006 నాటి 'కేసినో రాయలే'లో వెస్పర్ లిండ్ గా నటించిన ఎవా గ్రీన్ అనే అంటారు రసికులు.

మరపురాని మురిపాలు..

ఉర్సులా, ఎవా గ్రీన్ తరువాతి స్థానంలో డయానా రిగ్ నిలిచారు. బాండ్ ను పెళ్ళాడే యువతిగా 'ఆన్ హర్ మెజెస్టీస్ సీక్రెట్ సర్వీస్'లో నటించారామె. 1964 నాటి 'గోల్డ్ ఫింగర్'లో పుస్సీ గాలోర్ పాత్ర పోషించిన హానర్ బ్లాక్ మన్ నాలుగో స్థానంలో నిలిచారు. 1997లో విడుదలైన 'టుమారో నెవర్ డైస్'లో వాయ్ లిన్ పాత్ర ధరించిన మిచెల్లీ యో ఐదో స్థానం సంపాదించారు. ఈ ముద్దుగుమ్మలు మురిపించిన తీరును జేమ్స్ బాండ్ మూవీస్ ఫ్యాన్స్ ఈ నాటికీ మరచిపోలేరు.

ఆగని గిలిగింతలు..

జేమ్స్ బాండ్ మూవీస్ లో 'ద స్పై హూ లవ్డ్ మీ' 1977లో వెలుగు చూసింది. ఇందులో ఏజెంట్ ట్రిపుల్ ఎక్స్ పాత్రలో బార్బరా బాక్ తనదైన బాణీ పలికించారు. ఆమె ఆరో స్థానం సంపాదించగా, ఏడో స్థానంలో 'గోల్డెన్ ఐ'లో నటించిన ఫ్యామ్కే జాన్సెన్ ఉన్నారు. 1973 నాటి 'లివ్ అండ్ లెట్ డై' లో సాలిటేర్ గా నటించిన జేన్ సేమోర్ బాండ్ గాళ్స్ లో ఎనిమిదో ప్లేస్ దక్కించుకున్నారు. 'వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్'లో ఎలెక్ట్రా కింగ్ పాత్ర పోషించిన సోఫీ మార్క్యూ తొమ్మిదిలో నిలిచారు. పదో స్థానంలో బ్లాక్ బ్యూటీ హాలీ బెర్రీ ఉన్నారు.

2002లో విడుదలైన 'డై అనదర్ డే'లో హాలీ బెర్రీ 'జింక్స్ జాన్సన్' రోల్ ధరించారు. 'డాక్టర్ నో'లో మొదటి బాండ్ గాళ్‌గా నటించిన ఉర్సులా బీచ్ సీన్ స్ఫూర్తితో బ్లాక్ బ్యూటీతోనూ అదే తీరున సముద్రంలో ఆమె తడిసిన అందాలను చూపించారు. ఇలా ఈ పది మంది భామలు ఇప్పటికీ జేమ్స్ బాండ్ అభిమానులకు గిలిగింతలు పెడుతూనే ఉండడం గమనార్హం. అందువల్లే న్యూ బాండ్ గాళ్ గా ఎవరు ఎన్నికవుతారో అన్న ఆసక్తి జేమ్స్ బాండ్ ఫ్యాన్స్ లో నెలకొంది.

మోనికా కూతురు కూడా..

ఇటలీ సుందరి మోనికా బెల్లూచీకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. 2015లో వచ్చిన జేమ్స్ బాండ్ మూవీ 'స్పెక్టర్'లో లూసియా సియారా పాత్రలో మోనికా నటించారు. అందువల్ల కొందరు మోనికా బెల్లూచీ కూతురు డెవా క్యాజెల్ కూడా బాండ్ గాళ్ గా బాగుంటుందని అంటున్నారు. డెవా నటించిన తొలి చిత్రం 'ద బ్యూటిఫుల్ సమ్మర్'లోనే ఆమె అందం హిందోళం పాడింది. ఈ కారణంగానే బాండ్ గాళ్ గా డెవా కూడా న్యాయం చేయగలదని పలువురు మోనికా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ లక్కీ గాళ్ ఎవరో?

జేమ్స్ బాండ్ న్యూ గాళ్‌గా ఎవరైతే బాగుంటారు అంటూ కొందరు ఫ్యాన్స్ ఓ సర్వే నిర్వహించారు. అందులో మార్గరెట్ క్వాలే, అన్యా టేలర్-జాయ్ , ఫ్లారెన్స్ ప్యూ వరుసగా నిలిచారు. అయితే మరో గ్రూపులో ఫ్లారెన్స్ కే అధికంగా ఓటు వేస్తున్నారు. మార్గరెట్ క్వాలేకు కూడా అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇలా న్యూ జేమ్స్ బాండ్ ఎన్నిక పూర్తయిందో లేదో న్యూ బాండ్ గాళ్ కోసం ఫ్యాన్స్ తహతహలాడిపోతున్నారు.

ఎవరికి వారు తమకు నచ్చిన నాయికలను బాండ్ గాళ్స్ గా ఊహించేసుకుంటున్నారు. న్యూ బాండ్ మూవీ డైరెక్టర్ డెనిస్ విల్లెన్యూ ప్రస్తుతం తన తాజా చిత్రం 'డ్యూన్- పార్ట్ త్రీ' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 18న రిలీజ్ కానుంది... అదయ్యాక న్యూ బాండ్ గాళ్స్ కోసం అధికారికంగా అన్వేషణ మొదలవుతుంది. బహుశా 2027 సమ్మర్ నాటికి న్యూబాండ్ గాళ్ ఎవరో తేలిపోతుందని అంటున్నారు. ఆ లక్కీ గాళ్ ఎవరవుతారో చూడాలి.

Updated Date - Nov 23 , 2026 | 12:43 PM