ది ఒడిస్సీ వర్సెస్ స్పైడర్ మేన్ బ్యాండ్ న్యూ డే
ABN , Publish Date - Jul 25 , 2026 | 07:55 PM
క్రిస్టఫర్ నోలాన్ 'ది ఒడిస్సీ' హంగామా సాగుతూనే ఉంది. వచ్చే వారం 'స్సైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే' రానుంది. దాంతో ఈ రెండు సినిమాలపై సినీ ఫ్యాన్స్ భలేగా ముచ్చట్లు సాగిస్తున్నారు.. అవేంటో మరి?
'స్పైడర్ మేన్' ఇప్పటికే పలు మార్లు ప్రేక్షకులను విశేషంగా అలరించిన గాథ. ఇప్పుడు సరికొత్త హంగులతో స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే (Spider Man Brand New Day) రానుంది. జూలై 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో 'స్పైడర్ మేన్' ఫ్యాన్స్ మళ్ళీ థియేటర్లకు పరుగు తీసే పనిలో ఉన్నారు..ఇక ఈ మధ్య జనం ముందు నిలచిన హాలీవుడ్ సినిమాల్లో క్రిస్టఫర్ నోలాన్ ది ఒడిస్సీ (The Odyssey) మూవీ విశేషంగా సినీ గోయెర్స్ ను ఆకట్టుకుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే మొదటి నుంచీ క్రిస్టఫర్ తన 'ది ఒడిస్సీ'ని ఎంపిక చేసిన థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ థియేటర్స్ ను పట్టేశారు. అలా 'ది ఒడిస్సీ' వేరే ఫార్మాట్స్ లో తక్కువగానే రిలీజయింది. అయినప్పటికీ మంచి వసూళ్ళు రాబట్టింది. ఇండియాలోనే వంద కోట్ల రూపాయల క్లబ్ లో పాగా వేసేసింది 'ది ఒడిస్సీ'. 'స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే' కూడా అదే తీరున సత్తా చాటుతుందా అని సినీ ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.
రెండు సినిమా బడ్జెట్ ఒకటే!
ఇండియాలో 'స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే' కూడా ఈజీగా వంద కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని సినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'ది ఒడిస్సీ'- 'స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే' చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది. అలాగే ఇప్పటికీ ప్రపంచంలోని ప్రఖ్యాత ఐమ్యాక్స్ థియేటర్స్ ను 'ది ఒడిస్సీ' కోసం అట్టి పెట్టేశారు. అయినప్పటికీ కొన్ని కేంద్రాలలో 'ది ఒడిస్సీ' కన్నా మిన్నగా అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టింది 'స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే'. రెండు సినిమాలు ఒక్కోటి 250 మిలియన్ డాలర్స్ నిర్మాణ వ్యయంతో రూపొందాయి. అందువల్ల అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలోనూ, ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని దేశాల్లోనూ ఈ రెండు సినిమాలను పోలుస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏది 'బిలియన్ డాలర్స్' ముందుగా వసూలు చేస్తుందో అన్న దానిపై పందేలు సాగుతున్నాయి. 'ది ఒడిస్సీ' మూవీ ఇప్పటికే 364 మిలియన్స్ పోగేసింది. ఇంకా 636 మిలియన్స్ రాబట్టగలిగితే బిలియన్ డాలర్స్ చేరుకుంటుంది. అయితే 'స్పైడర్ మేన్'కు ఉన్న క్రేజ్ దృష్ట్యా 'బ్రాండ్ న్యూ డే' 'ది ఒడిస్సీ' కంటే ముందుగానే బిలియన్ డాలర్స్ పట్టేస్తుందని పరిశీలకుల అంచనా!
రెండింటా.. టామ్ హాలండ్
'స్పైడర్ మేన్' సిరీస్ లో ఇప్పటి దాకా వెలుగు చూసిన 9 చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ కావడం విశేషం. ఇక టామ్ హాలండ్ స్పైడర్ మేన్ గా నటించిన "స్పైడర్ మేన్ ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మేన్ - నో వే హోమ్" చిత్రాలు రెండూ బిలియన్ డాలర్స్ కు పైగా పోగేశాయి. విశేషమేంటంటే 'ది ఒడిస్సీ'లో మ్యాట్ డామ్ మెయిన్ హీరోగా నటించగా, ఆయన కొడుకు పాత్రను టామ్ హాలండ్ పోషించారు. ఇక 2017 నుంచీ టామ్ హాలండ్ 'స్పైడర్ మేన్' పాత్రలో అలరిస్తున్నారు. ఇలా టామ్ నటించిన రెండు సినిమాల మధ్యే పోటీ నెలకొనడం కూడా విశేషంగా మారింది. స్పైడర్ మేన్ గా టామ్ హాలండ్ నటించిన నాల్గవ చిత్రంగా 'స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే' వస్తోంది. మరి ఈ సినిమా ఎంత స్పీడ్ గా బిలియన్ డాలర్స్ పోగేస్తుందో చూడాలి.