బాక్సాఫీస్ మాన్స్టర్ వచ్చేస్తోంది.. ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ BTS టీజర్ అదిరింది
ABN , Publish Date - Aug 27 , 2026 | 08:58 PM
‘గాడ్జిల్లా మైనస్ వన్’ సీక్వెల్ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ నుంచి BTS టీజర్ విడుదలైంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ మాన్స్టర్ గాడ్జిల్లా మరోసారి వెండితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘గాడ్జిల్లా మైనస్ వన్’ విజయానంతరం తెరకెక్కుతున్న సీక్వెల్ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ (Godzilla Minus Zero) పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బిహైండ్ ది సీన్స్ (BTS) టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
ఈ ప్రత్యేక వీడియోలో సినిమా మేకింగ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా గాడ్జిల్లా పాత్రను తెరపై మరింత భారీగా, భయానకంగా చూపించేందుకు ఉపయోగిస్తున్న అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల రూపకల్పన, సెట్ వర్క్ వంటి అంశాలు ఇందులో హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు టకాషి యామజాకి (Yamazaki) తన బృందంతో కలిసి ప్రతి సన్నివేశాన్ని అత్యంత నాణ్యతతో రూపొందిస్తున్న తీరు టీజర్‌లో కనిపిస్తోంది. భారీ విధ్వంస దృశ్యాలు, నగరాలపై గాడ్జిల్లా దాడులు, విజువల్ ఎఫెక్ట్స్ పనితనం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
‘గాడ్జిల్లా మైనస్ వన్’ ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా అకాడమీ అవార్డ్ గెలుచుకుని సంచలనం సృష్టించింది. దీంతో సీక్వెల్‌పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా వచ్చిన BTS టీజర్ చూస్తే మేకర్స్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, విజువల్ స్పెక్టాకిల్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ప్రత్యేక అనుభూతిని అందించే ఈ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే అదే రోజున బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైతం థియేటర్లకు వస్తుండడం విశేషం.