Oscars: ఆస్కార్ నామినేషన్స్.. భారతీయ చిత్రాలకు దక్కని చోటు
ABN , Publish Date - Jan 22 , 2026 | 08:47 PM
సినీ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 98వ అకాడమీ అవార్డుల నామినేషన్స్ (Oscars) జాబితా విడుదలయింది.
సినీ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 98వ అకాడమీ అవార్డుల నామినేషన్స్ (Oscars 2026) జాబితా విడుదలయింది. భారతదేశం నుండి అధికార ఎంట్రీగా 'ఉత్తమ అంతర్జాతీయ చిత్రం' విభాగంలో పోటీపడ్డ 'హోమ్ బౌండ్'కు నిరాశ ఎదురయింది. కాగా, ఇతర మార్గాల్లో ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీపడ్డ ఏ భారతీయ చిత్రాలు కూడా ఒక్క నామినేషన్ దక్కించుకోలేక పోయాయి.
ఈ సారి ఆస్కార్ అవార్డుల జాబితాలో 'సిన్నర్స్' చిత్రం రికార్డ్ స్థాయిలో 16 నామినేషన్స్ సంపాదించడం విశేషం! ఇప్పటి దాకా అకాడమీ అవార్డుల్లో ఇన్ని నామినేషన్స్ సంపాదించి చిత్రం లేదు. అలా ఆస్కార్ నామినేషన్స్ లో 'సిన్నర్స్' ఓ చరిత్ర సృష్టించింది. లియోనార్డో డికాప్రియో నటించిన 'ఒన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' సినిమా 13 నామినేషన్స్ దక్కించుకుంది.
ఆ తర్వాతి స్థానంలో ఫ్రాంకెన్‌స్టైయిన్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్ వాల్యూ 9 విభాగాల్లో, హామ్నెట్ 8, బుగోనియా, ఎఫ్1, ది సీక్రెట్ ఏజెంట్, ట్రైన్ డ్రీమ్స్ నాలుగేసి విభాగాల్లో, అవతార్: ఫైర్ అండ్ యాష్ , బ్లూ మూన్, ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్, కెపాప్ డెమోన్ హంటర్స్, సిరాట్ రెండేసి విభాగాల్లో నామినేట్ అయ్యాయి.
ఇక.. బ్రెజిల్ నుంచి ది సీక్రెట్ ఏజెంట్, ఫ్రాన్స్ నుంచి ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్, నార్వే నుంచి సెంటిమెంటల్ వాల్యూ, తునీసియా నుంచి ది వాయిస్ ఆఫ్ హిండ్ రాజాబ్, స్పెయిన్ నుంచి సిరట్ సినిమాలు ఇంటర్నేషనల్ ఫీచర్ విబాగంలో నామినేషన్లు దక్కించుకున్నాయి.