Adolescence: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘అడాల్‌సెన్స్’
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:17 PM
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక ఈసారి ఘనంగా జరిగింది. జనవరి 4న జరిగిన ఈ వేడుకలో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘అడాల్‌సెన్స్’ (Adolescence) అవార్డుల పంట పండించింది.
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల (critics choice awards) వేడుక ఈసారి ఘనంగా జరిగింది. జనవరి 4న జరిగిన ఈ వేడుకలో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘అడాల్‌సెన్స్’ (Adolescence) అవార్డుల పంట పండించింది. మొత్తం ఆరు నామినేషన్లకు గానూ నాలుగు కీలక విభాగాల్లో విజేతగా నిలిచి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.
ఉత్తమ సిరీస్ అవార్డుతో పాటు, ఇందులో అద్భుతమైన నటన కనబరిచిన స్టీఫెన్ గ్రాహం ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ఎరిన్ డోహెర్టీ ఉత్తమ సహాయనటిగా పురస్కారాన్ని అందుకున్నారు. మరోవైపు ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన ఓవెన్ కూపర్ అతి చిన్న వయసులోనే ఉత్తమ సహాయ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు అందుకుని రికార్డు సృష్టించడం విశేషంగా నిలిచింది. గతంలో ప్రకటించిన 77వ ఎమ్మీ అవార్డులలో కూడా ‘అడాల్‌సెన్స్’ ఐదు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. వరుసగా అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటూ ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. గతేడాది మార్చి 17న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అడాల్‌సెన్స్’ విడుదలైన నాటి నుంచే భారీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌ల జాబితాలో టాప్–10లో స్థానం సంపాదించుకుంది.
పిల్లలపై సోషల్‌మీడియా ప్రభావం, ఆన్‌లైన్ ట్రోలింగ్ వల్ల కలిగే మానసిక ఒత్తిడి వంటి సున్నితమైన అంశాలను ఈ సిరీస్ ప్రస్తావించారు. 13 ఏళ్ల వయసున్న ఓ బాలుడు తన తోటి విద్యార్థినిని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన నేపథ్యంలో సాగే కథ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా రూపొందించారు. సమాజానికి అద్దం పట్టే కథనంతో పాటు, బలమైన నటన, టెక్నికల్ విలువలతో ‘అడాల్‌సెన్స్’ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది