Cannes 2026: మిస్ వెనెజువెలా ఆండ్రియా స్టైలిస్ట్ దాడి...
ABN , Publish Date - May 23 , 2026 | 12:08 PM
ప్రపంచ సినిమా, ఫ్యాషన్ రంగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 19న మొదలైన సంగతి తెలిసిందే.
ప్రపంచ సినిమా, ఫ్యాషన్ రంగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఈ నెల 19న మొదలైన సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్‌పై హోయలొలికించడానికి ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు ఈ వేడుకలో భాగం కావడానికి తహతహలాడుతుంటారు. ప్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో పెర్‌ఫామ్ చేయడానికి ఎంతోమంది తారలు, మోడల్స్ క్యూ కట్టారు. అక్కడ చోటు చేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేన్స్‌లోని హోటల్ రూమ్‌లో సెలబ్రిటీ స్టైలిస్ట్ లగునా (Laguna) తనపై కత్తెరతో దాడి చేసినట్లు 2025 మిస్ వెనెజువెలా ఆండ్రియా డెల్‌వాల్ (Andrea Dell’Val)ఆరోపించారు. ముఖంపై రక్తపు గాయాలను చూపిస్తూ ఆండ్రియా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియోలో ఆమె ముఖంపై రక్తపు మరకలు కనిపిస్తుండగా.. గది అంతా గందరగోళంగా కనిపించింది. ఆ స్టైలిస్ట్ సైతం అక్కడే ఉండడం గమనార్హం. ఆండ్రియాపై దాడి గురించి హోటల్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లగునాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి మీడియా వార్తలు ప్రచురించింది. అయితే లగునా, ఆండ్రియా మధ్య గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే కేన్స్ నిర్వాహకులు, ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆండ్రియా డెల్‌వాల్ చికిత్స పొంది ప్రమాదం నుంచి బయట పడినట్లు మీడియా తెలిపింది.