నటి మెరిల్ స్ట్రీప్‌తో కరణ్‌ జోహార్‌ ఫోటో!

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:36 PM

ఇటీవల 'ద డెవిల్ వేర్స్ ప్రడా-2' మూవీని టోక్యోలో ప్రదర్శించారు. ఆ ప్రీమియర్‌కు కరణ్ జోహార్ కూడా వెళ్ళారు. ఆ సందర్భంగా తన అభిమాన నటి మెరిల్ స్ట్రీప్‌తో ఫొటో తీసుకున్నారు కరణ్.

Meryl Streep - Karan Johar

సినీజనం అంటే కొందరికి ఎంతో క్రేజ్! వారితో కరచాలనం చేస్తే చాలని, మాట్లాడాలని, వారితో కలసి ఫొటోస్ తీసుకోవాలని - ఇలా భలేగా ఆశిస్తూ ఉంటారు సామాన్య జనం. సినిమా వాళ్ళకు కూడా తాము అభిమానించేవారితో అలాగే ప్రవర్తించాలని ఉంటుంది. అదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) చెబుతున్నారు. ఇరవై ఏళ్ళ క్రితం జనాన్ని విశేషంగా అలరించిన 'ద డెవిల్ వేర్స్ ప్రడా' (The Devil Wears Prada) మూవీకి ఇప్పుడు సీక్వెల్ గా 'ద డెవిల్ వేర్స్ ప్రడా-2' రానుంది. ఈ చిత్రంలో ప్రఖ్యాత హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ (Meryl Streep)ప్రధాన పాత్ర పోషించారు. రెండు దశాబ్దాల తరువాత కూడా మెరిల్ తన పాత్రను తానే ధరించడం విశేషం! ఈ రెండు భాగాల్లోనూ మెరిల్ తో కలసి ఆనీ హాత్వే (Anne Hathaway) కూడా నటించారు. ఇటీవల 'ద డెవిల్ వేర్స్ ప్రడా-2' మూవీని టోక్యో (Tokyo)లో ప్రదర్శించారు. ఆ ప్రీమియర్ కు కరణ్ జోహార్ కూడా వెళ్ళారు. ఆ సందర్భంగా తన అభిమాన నటి మెరిల్ స్ట్రీప్ తో ఫొటో తీసుకున్నారు కరణ్. అందులో ఆనీ హాత్వే కూడా ఉన్నారు. వారితో ఫొటో తీసుకుంటున్నప్పుడు తన కాళ్ళు వణికాయని కరణ్ గుర్తు చేసుకున్నారు. అంటే కరణ్ కూడా మెరిల్ ను చూసి ఓ అభిమానిలా ఫీలయ్యారన్న మాట.


ఎన్నో విధాల తనకు మెరిల్ స్ట్రీప్ గురువులాంటి వారని కరణ్ అంటున్నారు. మెరిల్ అభినయాన్ని చూసి ఆనందించడమే కాదు, ఆమెలా నటించడానికీ ప్రయత్నించేవాడినని గుర్తు చేసుకున్నారు. 2006లో వచ్చిన 'ద డెవిల్ వేర్స్ ప్రడా' చిత్రాన్ని తాను 47 సార్లు చూశానని చెబుతున్నారు కరణ్. తాను టీవీ షోస్ లో అందరినీ ఆకట్టుకొనేలా నటించడానికి స్ఫూర్తినిచ్చింది మెరిల్ స్ట్రీప్ నటన అని అసలు విషయం బయట పెట్టారు. కరణ్ ఏదీ దాచుకోకుండా తన అభిమాన నటితో 'ఫ్యాన్ బాయ్ మోమెంట్'ను గుర్తు చేసుకోవడంపై నెటిజన్స్ భలేగా కామెంట్స్ జోడిస్తున్నారు. మన దేశంలోని ఇన్ ఫ్లూయర్స్ లో ఒకరిగా పేరొందిన కరణ్ వెనకాల ఇంత కథ ఉందా అనీ కొందరు అంటున్నారు. కరణ్ అలా చెప్పినా తన 'కాఫీ విత్ కరణ్' షో లో తనదైన బాణీ పలికించారన్న విషయాన్ని ఓ కాస్టింగ్ డైరెక్టర్ గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మెరిల్ స్ట్రీప్ 17 సార్లు ఉత్తమనటి విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ సంపాదించిన నటిగా చరిత్ర సృష్టించారు. మరో నాలుగు సార్లు 'సపోర్టింగ్ రోల్స్' కోసం మెరిల్ నామినేషన్స్ అందుకున్నారు. అలా 21 సార్లు ఆస్కార్ నామినేషన్స్ అందుకున్న ఏకైక నటిగా నిలిచారు మెరిల్. 'సోఫీస్ ఛాయిస్ (Sophie's Choice), ది ఐరన్ లేడీ (The Iron Lady)' చిత్రాల ద్వారా బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ అందుకున్న మెరిల్, 'క్రామర్ వర్సెస్ క్రామర్' (Kramer Vs Kramer)తో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గానూ ఆస్కార్ చేజిక్కించుకున్నారు. ఇంతటి ప్రతిభావంతురాలైన మెరిల్ తో కరణ్ లాంటి మూవీమేకర్, హోస్ట్ - ఫొటో తీయించుకోవడం విశేషమే కదా!

Updated Date - Apr 08 , 2026 | 06:36 PM