మొబైల్‌లోనే కాదు.. ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్!

ABN , Publish Date - Nov 29 , 2026 | 10:08 AM

ఇప్ప‌టివ‌ర‌కు మొబైల్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇక‌పై స్మార్ట్ టీవీల్లోకి తీసుకువ‌స్తున్న‌ట్లు మెటా ప్ర‌క‌టించింది.

Instagram for TV

సోషల్ మీడియా వినియోగంలో ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లకే పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్‌ వినోదాన్ని ఇకపై టీవీ తెరపై కూడా ఆస్వాదించే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఫర్ టీవీ’ (Instagram for TV) పేరుతో కొత్త యాప్‌ను తీసుకురానున్నట్లు మెటా (Meta India Announcement) ప్రకటించింది. త్వరలోనే ఈ సేవలను భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

ముంబయిలో శుక్రవారం నిర్వహించిన మెటా వార్షిక క్రియేటర్ ఈవెంట్‌ ‘హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్‌’లో ఈ కొత్త ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రీల్స్‌ను పెద్ద తెరపై చూసేందుకు ఈ యాప్‌ ఉపయోగపడనుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీడియోలను వీక్షించాలనుకునే వారికి ఇది కొత్త అనుభూతిని అందించనుంది.

ఈ కొత్త యాప్‌ ద్వారా ఒకే స్మార్ట్ టీవీలో గరిష్ఠంగా ఐదు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను ఉపయోగించుకునే సదుపాయం కల్పించనున్నారు. ఇప్పటికే మొబైల్‌లో వినియోగిస్తున్న ఖాతాను టీవీకి అనుసంధానం చేసుకోవచ్చు. అయితే వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను టీవీతో లింక్ చేయడం ఇష్టం లేనివారికి మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. టీవీలో రీల్స్‌ చూసేందుకు ప్రత్యేకంగా కొత్త ఖాతాను సృష్టించుకునే వెసులుబాటును మెటా కల్పిస్తోంది.

Instagram for TV

సాధారణంగా మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చూడాలంటే వినియోగదారులు ఒక్కో వీడియోను పైకి స్క్రోల్ చేస్తూ చూడాల్సి ఉంటుంది. కానీ టీవీ యాప్‌లో మాత్రం దానికి కొంత భిన్నంగా ఉండనుంది. ఒక రీల్‌ పూర్తయిన తర్వాత మరో రీల్‌ ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే విధంగా దీన్ని రూపొందించారు. దీంతో రిమోట్‌ చేతిలో పట్టుకుని పదేపదే వీడియోలను మార్చాల్సిన అవసరం తగ్గనుంది.

అంతేగాక వీక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా వీడియోలను పెద్ద తెరపై వీక్షించేలా ఈ యాప్‌ పనిచేయనుంది. చిన్న స్క్రీన్‌పై చూసే రీల్స్‌ను హై ఎక్స్‌పీరియన్స్‌తో టీవీలో ఆస్వాదించే అవకాశం కలగనుంది. ముఖ్యంగా వినోదం, కామెడీ, సినిమా అప్‌డేట్స్‌, ఫుడ్‌, ట్రావెల్‌, లైఫ్‌స్టైల్‌ వంటి విభిన్న అంశాలకు సంబంధించిన షార్ట్‌ వీడియోలను టీవీలో ఎంచ‌క్కా ఇంట్లో కూర్చోని చూడవచ్చు.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఈ యాప్‌ ఆపిల్‌ టీవీ (Apple TV), అమెజాన్‌ ఫైర్‌ టీవీ (Amazon Fire TV), గూగుల్‌ టీవీ (Google TV) సపోర్ట్ చేసే స్మార్ట్‌ టీవీల్లో మాత్ర‌మే ఈ సేవలు అందుబాటులో ఉండ‌నుంది. కాగా మెటా ఇప్పటికే అమెరికాలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. భారత్‌లోనూ త్వరలోనే ఈ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.

Updated Date - Nov 29 , 2026 | 10:08 AM