ఏంటి.. అవతార్ సీక్వెల్స్ ఇక రావా? కేమరాన్ మామ.. ఎంత ప‌ని చేశావ్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:04 PM

ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ను ఆకర్షించిన 'అవతార్' ఫ్రాంచైజ్ లో తరువాతి చిత్రాలు వస్తాయా?... ఈ డౌట్ హాలీవుడ్ లోనే వినిపిస్తోంది... ఎందుకలాగా...!?

avatar

'విజువల్ ఫీస్ట్' అన్న మాటకు అర్థం చెబుతూ విఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ (James Cameron) తన చిత్రాలను రూపొందిస్తూంటారు. జేమ్స్ డైరెక్షన్ లో రూపొందిన నాలుగు చిత్రాలు భారీ వసూళ్ళు చూసిన సినిమాల జాబితాలో నిలిచాయి. 1997లో జేమ్స్ అందించిన 'టైటానిక్', అవతార్ (Avatar) సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు ఇప్పటికి టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి.

ఈ నేపథ్యంలో 'అవతార్-4' సెట్స్ కు ఎప్పుడు వెళ్తుందనే ఆసక్తి ఆ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ లో నెలకొంది. జేమ్స్ కేమరాన్ మాత్రం స్క్రిప్ట్ సిద్ధమైనా, సినిమా తీసే వనరులు పుష్కలంగా ఉన్నా పునరాలోచనలో ఉన్నానని అంటున్నారట. అదే ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తోన్న అంశం.

జేమ్స్ కేమరాన్ తన 'టెర్మినేటర్-2' దాకా స్పీడ్ గా సినిమాలు తీశారు. ఆ తరువాత మూడేళ్ళకు 'ట్రూ లైస్'తో పలకరించారు. ఆ పై మరో మూడేళ్ళకు 'టైటానిక్'తో అలరించారు. దాదాపు 12 ఏళ్ళ తరువాత 'అవతార్' మొదటి భాగాన్ని 2009లో విడుదల చేశారు. ఈ నాటికీ ఈ మూవీ టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ గా రాజ్యమేలుతోంది. ఈ మూవీ వచ్చిన 13 ఏళ్ళకు 2022లో 'అవతార్ -2' రిలీజ్ చేయగా, ఆ సినిమా సైతం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం టాప్ గ్రాసర్స్ లో మూడో స్థానంలో నిలచింది.

Avatar

గత సంవత్సరం డిసెంబర్ 19న 'అవతార్-3'ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా, ఈ మూవీ సైతం బిలియన్ డాలర్లు దాటేసి ఇంకా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే అందరికీ 'అవతార్-4' ఎప్పుడు సెట్స్ కు వెళ్తుందా అన్న ఆసక్తి నెలకొంది. వాస్తవానికి 'అవతార్' నాలుగో భాగాన్ని 2029 డిసెంబర్ 21న రిలీజ్ చేస్తామని కేమరాన్ ప్రకటించారు. ఇక ఈ సిరీస్ లో చివరిదైన 'అవతార్ -5'ను 2031 డిసెంబర్ 19న విడుదల చేస్తామని తెలిపారు. మరి ఈ సమయంలో ఈ రెండు చిత్రాలపై తాను పునరాలోచిస్తున్నానని జేమ్స్ చెప్పడం ఫ్యాన్స్ కు వింతగా అనిపిస్తోంది.

'అవతార్' మూవీ ప్యాన్స్ ను కూడా సంప్రందించి తరువాతి స్టెప్ వేస్తానంటున్నారు జేమ్స్. అసలు ఆయన అలా ఎందుకు అంటున్నారు అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్' కారణంగానే జేమ్స్ పునరాలోచన అన్న పదాన్ని వినియోగించారని సన్నిహితులు చెబుతున్నారు.

ఒకప్పుడు 'ఏఐ'ని వ్యతిరేకించిన జేమ్స్ 'అవతార్ -3' పూర్తయ్యే సమయంలో 'కృత్రిమ మేధ' విలువ తెలిసిందని, దానిని అనువుగా ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. అందువల్ల రాబోయే 'అవతార్' రెండు భాగాలను 'ఏఐ' సాయంతో మరింత స్పీడ్ గానూ రూపొందించవచ్చునని వినిపిస్తోంది. అదే నిజమైతే రెండేళ్ళలోనే 'అవతార్' తరువాతి భాగాలు వెలుగు చూడవచ్చుననీ అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

Updated Date - Mar 11 , 2026 | 08:04 PM